242 పాయింట్లు అప్

5 Aug, 2014 01:27 IST|Sakshi
242 పాయింట్లు అప్

గత రెండు వారాల్లోలేని విధంగా స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగశాయి. ఉదయం నుంచీ లాభాల్లోనే కదులుతూ ట్రేడింగ్ గడిచేకొద్దీ మరింత బలపడ్డాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పుంజుకుని 25,723 వద్ద ముగిసింది. వెరసి రెండు రోజుల భారీ నష్టాలకు చెక్ పడింది. గత వారం చివరి రెండు రోజుల్లో సెన్సెక్స్ 606 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా, వినియోగ వస్తువులు, ఐటీ, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ 3-1.5% మధ్య పురోగమించాయి. ఇక నిఫ్టీ కూడా 81 పాయింట్లు ఎగసి 7,684 వద్ద నిలిచింది.

ఉక్రెయిన్, గాజాలలో ఆందోళనలు ఉపశమించడం, ముడిచమురు ధరలు క్షీణించడం, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్పిరిటో శాంటో యాజమాన్య నిర్వహణను పోర్చుగీస్ కేంద్ర బ్యాంక్ చేపట్టడం వంటి అంశాలు అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంట్‌ను మెరుగుపరచాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. డాలరుతో మారకంలో బలహీనపడ్డ రూపాయి ఐటీ షేర్లకు జోష్‌నివ్వగా, ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, జూలై నెలలో పుంజుకున్న వాహన విక్రయాల నేపథ్యంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్ తదితర రంగాల షేర్లకు ప్రోత్సాహం లభించిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

 5 మాత్రమే: సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, భారతీ, సిప్లా మాత్రమే అదికూడా 1%లోపు నష్టపోయాయి. మిగిలిన బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్ దాదాపు 4% జంప్‌చేయగా, హిందాల్కో, సెసాస్టెరిలైట్, విప్రో, మారుతీ, భెల్, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఐసీఐసీఐ 3-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐలు రూ. 373 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 251 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.

 సిండికేట్ బ్యాంక్ 7% డౌన్: లంచం పుచ్చుకున్న నేరానికి చైర్మన్ ఎస్‌కే జైన్‌ను సీబీఐ అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపడంతో సిండికేట్ బ్యాంక్ షేరు 7% పతనమై రూ. 134 వద్ద ముగిసింది. ఈ కేసుతో సంబంధమున్న ప్రకాష్ ఇండస్ట్రీస్ షేరు 20% కుప్పకూలగా, భూషణ్ స్టీల్ 3.5% నష్టపోయింది. ట్రేడైన షేర్లలో 1,810 పుంజుకోగా, 1,108 మాత్రమే నష్టపోయాయి.

మరిన్ని వార్తలు