మార్కెట్‌పై యుద్ధ మేఘాలు!

28 Feb, 2019 00:41 IST|Sakshi

తోడైన డెరివేటివ్స్‌ ముగింపు 

తీవ్ర హెచ్చుతగ్గుల్లో సెన్సెక్స్, నిఫ్టీలు 

+397 నుంచి –238 మధ్య కదలాడిన సెన్సెక్స్‌

68 పాయింట్లు పతనమై 35,905 వద్ద ముగింపు 

29 పాయింట్లు తగ్గి 10,807కు నిఫ్టీ 

భారత్‌–పాక్‌ ఉద్రిక్తతల తీవ్రతతో స్టాక్‌ మార్కెట్‌ ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ రెండో రోజూ ప్రధాన స్టాక్‌ సూచీలు నష్టపోయాయి.   ఫిబ్రవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటం కూడా జత కావడంతో స్టాక్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి.  635 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 68 పాయింట్ల నష్టంతో 35,905 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్లు తగ్గి 10,807 పాయింట్ల వద్ద ముగిశాయి. 

మధ్యాహ్నం వరకూ లాభాలే...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారిపోయింది.  ఒక దశలో 397 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్, మరో దశలో 238 పాయింట్లు నష్టపోయింది.  మొత్తంగా   635 పాయింట్ల రేంజ్‌లో తిరిగింది.  నిఫ్టీ ఒక దశలో 104 పాయింట్లు లాభపడగా, మరో దశలో 84 పాయింట్లు పతనమైంది. 

మరికొన్ని రోజులు ఇదే ఉద్రిక్తత..
మరికొన్ని రోజులు ఇదే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని షేర్‌ఖాన్‌ (బీఎన్‌పీ పారిబా) అడ్వైజరీ హెడ్‌ హేమాంగ్‌ జని సూచించారు. ఈ విషయమై స్పష్టత వచ్చేంత వరకూ జాగరూకతతో ఉండాలని పేర్కొన్నారు.  అయితే భారత్‌ ఆర్థిక ఫండమెంటల్స్‌ పటిష్టమన్నారు. 

లాభాల్లో ఆ మూడు బ్యాంక్‌లు....
పీసీఏ చట్రం నుంచి బైటపడిన 3 బ్యాంక్‌లు ధనలక్ష్మీ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు 5–10% వరకూ పెరిగాయి. 
►టాటా మోటార్స్‌ షేర్‌ 3 శాతం నష్టంతో రూ.177 వద్ద ముగిసింది. 
►ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా షేర్‌ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,979ను తాకింది. చివరకు 5% లాభంతో రూ.1,954 వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్‌ 10న రూ.1,315గా ఉన్న ఈ షేర్‌ రెండు నెలల్లోనే 49% లాభపడింది. 
►నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, ధరల పెరుగుదల కారణంగా సిమెంట్‌ కంపెనీలు లాభాలు పెరుగుతాయనే అంచనాలతో పలు సిమెంట్‌ కంపెనీల షేర్లు పెరిగాయి. 
►మార్కెట్‌ నష్టపోయినప్పటికీ, 30కి పైగా షేర్లు ఇంట్రాడేలో తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, యూపీఎల్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడ్డాయి. ఫ్యూచర్‌ రిటైల్, గుజరాత్‌ గ్యాస్‌లు వీటిలో ఉన్నాయి.
►బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో తన వర్క్‌డే, కార్నర్‌స్టోన్‌ ఆన్‌ డిమాండ్‌ బిజినెస్‌లను అమెరికాకు చెందిన ఎలైట్‌ కంపెనీకి విక్రయించనున్నది. అంతా నగదులోనే జరిగే ఈ డీల్‌ విలువ 11 కోట్ల డాలర్లని విప్రో తెలిపింది. ఈ కంపెనీ షేర్‌ ధర రూ. 374 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా