బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనీస స్పీడ్ 2ఎంబీపీఎస్

8 Sep, 2015 01:59 IST|Sakshi
బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనీస స్పీడ్ 2ఎంబీపీఎస్

- అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి
గుర్గావ్:
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే నెల (అక్టోబర్) 1 నుంచి సెకనుకు 2 మెగా బిట్ (ఎంబీపీఎస్) కనీస స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ పథకాన్ని సోమవారం ఆవిష్కరించారు. బ్రాడ్‌బ్యాండ్ వేగం పెరగడం డిజిటల్ ఇండియా నినాదానికి తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 512 కేబీపీఎస్ కనీస స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందిస్తున్నామని, అక్టోబర్ 1 నుంచి నాలుగు రెట్లు అధిక స్పీడ్‌తో అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. దీనికి అదనంగా ఎటువంటి చార్జీలు ఉండవని వివరించారు.
 
కాగా, టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా వారికి తగిన సౌకర్యలందేలా చూడాలని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాలపై టెల్కోలు దృష్టిసారించాలని సూచించారు. టెలికం కంపెనీలు నెట్‌వర్క్‌ను విస్తృతం చేయాలని, కాల్ డ్రాప్స్ సమస్యల ఇటీవల కాలంలో మరింత అధ్వానమైందని తెలిపారు.

మరిన్ని వార్తలు