బాకీల వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

12 Aug, 2019 08:40 IST|Sakshi

రూ. 3,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు 

న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం కార్పొరేట్‌ క్లయింట్ల నుంచి బాకీల వసూళ్ల పనిలో పడింది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల్లో సింహభాగం మొత్తాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తోంది. కంపెనీ సీఎండీ పి.కె. పుర్వార్‌ ఈ విషయాలు వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలను కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పుర్వార్‌ వెల్లడించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్స్‌ నుంచి దాదాపు రూ. 3,000 కోట్ల బకాయిలు రావాలి. వాటిని రాబట్టుకునేందుకు రోజువారీ చర్యలు మరింత ముమ్మరం చేశాం. కచ్చితంగా రాబట్టుకుంటాం‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎప్పట్లోగా మొత్తం రికవర్‌ అవుతుందన్నది చెప్పడం కష్టమని, అయితే వచ్చే రెండు, మూడు నెలల్లో అధిక భాగాన్ని రాబట్టుకోగలమని తెలిపారు. మరోవైపు, భవంతులు మొదలైనవి లీజుకివ్వడం ద్వారా ఈ ఏడాది కనీసం రూ. 1,000 కోట్లు అద్దెల రూపంలో ఆదాయాలను పెంచుకోవాలనేది బీఎస్‌ఎన్‌ఎల్‌ యోచన. గతంలో ఈ మొత్తం రూ. 200 కోట్లు. వీటితో పాటు అవుట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల క్రమబద్దీకరణ ద్వారా ఏటా రూ. 200 కోట్లు ఆదా చేసుకోవాలని, విద్యుత్‌ బిల్లుల భారాన్ని 15 శాతం మేర తగ్గించుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోంది.

మరిన్ని వార్తలు