35 వేల మందికి వీఆర్‌ఎస్‌ 

12 Feb, 2019 01:18 IST|Sakshi

ఎల్‌టీసీ తదితర ప్రయోజనాల నిలిపివేత

వ్యయాలు తగ్గించుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ చర్యలు

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఎల్‌టీసీ తదితర ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 35,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) అమలు చేయాలని భావిస్తోంది. సంస్థ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ ఈ విషయాలు తెలియజేశారు. వ్యయ నియంత్రణ చర్యలతో గతేడాది దాదాపు రూ. 2,500 కోట్ల మేర ఆదా చేయగలిగామని, ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆ స్థాయి కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో ఉద్యోగులకు ఎల్‌టీసీ మొదలైన వాటి రూపంలో ఇచ్చే ప్రయోజనాల విలువ సుమారు రూ. 625 కోట్ల మేర ఉంటుందన్నారు.

సాధారణంగా ప్రైవేట్‌ రంగ టెల్కోల్లో 25,000– 30,000 మంది ఉద్యోగులు ఉంటుండగా, బీఎస్‌ఎన్‌ఎల్‌లో దానికి దాదాపు అయిదు రెట్లు అధికంగా 1.8 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరి వ్యయాలు వార్షికంగా రూ.15,000 కోట్ల స్థాయిలో ఉంటున్నాయి. ‘విద్యుత్, అడ్మినిస్ట్రేషన్‌ పరమైన వ్యయాలను తగ్గించుకుంటున్నాం. అలాగే ఉద్యోగులకిచ్చే ప్రయోజనాలను ఫ్రీజ్‌ చేస్తున్నాం. ప్రస్తుతానిౖMðతే ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) మొదలైన ప్రయోజనాలు అందించడం లేదు. అలాగే వైద్య చికిత్స వ్యయాలను కూడా నియంత్రిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ తెలియజేశారు. 

పునర్‌వ్యవస్థీకరణపై నివేదిక..
కంపెనీ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఐఐఎం అహ్మదాబాద్‌ రూపొందించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు, త్వరలో తుది నివేదిక ఇవ్వనున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. రూ.13,000 కోట్ల వ్యయంతో సుమారు 35,000 మందికి వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ చేసే ప్రతిపాదన కూడా ఈ సిఫార్సుల్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. వీఆర్‌ఎస్‌ ప్యాకేజీకి కావాల్సిన నిధులను సమీకరించుకునే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సాయం కోరడం లేదా తక్కువ వడ్డీకి రుణాల రూపంలో సమకూర్చుకోవడం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. వాస్తవానికి అదృష్టవశాత్తూ కంపెనీని నిలబెట్టేందుకు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రైవేట్‌ టెల్కోలతో పోటీపడలేక నానా తంటాలు పడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2016లో రిలయన్స్‌ జియో రాకతో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు