కరోనా : బీఎస్‌ఎన్‌ఎల్‌, నెల రోజులు ఫ్రీ

20 Mar, 2020 20:46 IST|Sakshi
బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ (ఫైల్‌ ఫోటో)

‘వర్క్‌ ఫ్రం హోం’ బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌

ప్రమోషనల్‌ ఆఫర్‌ : నెల రోజులు ఫ్రీ డేటా

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌  వేగంగా  విస్తరిస్తున్ననేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌  తన కస‍్టమర్ల సౌలభ్యం కోసం ఒక ఆఫర్‌ను తీసుకొచ్చింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఇంటినుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే  కోవిడ్-19 (కరోనా వైరస్‌) వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ లైన్‌ వినియోగదారులకోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 'వర్క్ ఫ్రమ్‌ హోమ్' ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.

ప్రమోషనల్‌ ఆఫర్‌ తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది. ప్రమోషనల్ వ్యవధి ముగిసిన తరువాత, పై ప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు  మరలతారని బీఎస్‌ఎన్‌ఎల్‌ తన  సర్క్యులర్‌లో తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్‌ఎస్ డౌన్ స్పీడ్‌ను,  రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది.  ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. 

బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ ఉండి, బ్రాడ్‌బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒక నెల ఉచితంగా అందిస్తున్నామని, తద్వారా వారు ఈ సేవను ఇంటి నుండి పని చేయడానికి, ఇంటి నుండే విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు. ఇంటి నుండే కిరాణాను ఆన్‌లైన్‌లో కొనుగోలు, లేదా అవసరమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లవలసిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.  కాగా  ల్యాండ్‌లైన్ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చడంలో ఈ సరికొత్త ప్లాన్‌ సహాయపడుతుందని అంచనా. ముఖ్యంగా ప్రధాన పోటీదారులు, ఎయిర్‌టెల్‌,  జియోతోపాటు, ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో బాగా పోటీ పడటానికి సహాయపడుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు