స్మార్ట్‌ఫోనే కార్డ్‌లెస్‌ ఫోన్‌..!

17 Jan, 2017 04:45 IST|Sakshi
స్మార్ట్‌ఫోనే కార్డ్‌లెస్‌ ఫోన్‌..!

బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఎఫ్‌ఎంటీ, డిట్టో టీవీ సేవలు
న్యూఢిల్లీ: ప్రైవేటు కంపెనీల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ టీవీ, పరిమిత ఫిక్స్‌డ్‌ మొబైల్‌ టెలిఫోనీ (ఎఫ్‌ఎంటీ) సేవలను ప్రారంభించింది. ఈ రెండూ యాప్‌ ఆధారితంగా పొందే సేవలు. ఇంట్లో, కార్యాలయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌ ఉంటే స్మార్ట్‌ఫోన్‌ను కార్డ్‌లెస్‌ ఫోన్‌గా ఉపయోగించుకుని కాల్స్‌ చేసుకోవచ్చు. ఆ కాల్స్‌ ల్యాండ్‌ ఫోన్‌ ద్వారానే వెళతాయి. ల్యాండ్‌ ఫోన్, స్మార్ట్‌ఫోన్‌ మధ్య యాప్‌ అనుసంధానత కల్పిస్తుంది.

ఈ సదుపాయం పొందేందుకు ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌తోపాటు బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ కూడా ఉండాలి. ప్లేస్టోర్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎఫ్‌ఎంటీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫిక్స్‌డ్‌ మొబైల్‌ టెలిఫోనీ సేవలను గతేడాది ప్రారంభించి సెల్యులార్‌ ఆపరేటర్ల అభ్యంతరాలతో ఉపసంహరించుకున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. అయితే, గతంలో ఎఫ్‌ఎంటీ సేవలు రోమింగ్‌లో ఉన్న సమయంలో తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా ల్యాండ్‌లైన్‌కు అనుసంధానమై కాల్స్‌ చేసుకునేందుకని... ప్రస్తుత ఎఫ్‌ఎంటీ ఇళ్లకే పరిమితం చేసినట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

కస్టమర్లు తమ స్టార్ట్‌ఫోన్‌లోని కాంటాక్టు లిస్టు నుంచి కావాలనుకున్న నంబర్‌ను ఫిక్స్‌డ్‌ లైన్‌ ద్వారా చేసుకునే సౌలభ్యం ఉంటుందని, ల్యాండ్‌లైన్‌ టారిఫ్‌ ప్రయోజనాలు అందుకోవచ్చన్నారు. ఈ సదుపాయం కోసం ప్రత్యేకంగా వేరే నంబర్‌ను కేటాయించడం జరుగుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. ఇక డిట్టో టీవీ అనేది మొబైల్‌లోనే టీవీ చానల్స్‌ను వీక్షించేందుకు ఉద్దేశించినది. 80 చానల్స్‌ను లైవ్‌గా వీక్షించవచ్చని, నెలకు 20 రూపాయల కనీస చందా అని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు