బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు యప్‌టీవీ!

22 Oct, 2019 05:18 IST|Sakshi

‘ట్రిపుల్‌ ప్లే’ సేవలకోసం ఇరుపక్షాల ఒప్పందం

దీపావళికి ముందే వేతనాలు: బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ  

సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు త్వరలో యప్‌ టీవీ ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌–యప్‌ టీవీ సోమవారమిక్కడ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పీకే పుర్వార్, యప్‌ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్‌ రెడ్డి ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో 250 లైవ్‌ టీవీ ఛానల్స్, 5 వేలకుపైగా సినిమాలు, వందకుపైగా టీవీ షోలు, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, ఒరిజినల్‌ సిరిస్, ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో లాంటి సేవలను అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ యూజర్లు, బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారులకు యప్‌ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయి. తాజా ఉదయ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌  సేవలందిస్తోందని, వారందరికీ యప్‌టీవీ ట్రిపుల్‌ ప్లే సేవలు చేరువవుతాయని చెప్పారు.

పునరుద్ధరణ ప్రణాళికపై సీఎండీ పుర్వార్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్రణాళికను నెలలో ప్రజల ముందు ఉంచుతామని సంస్థ సీఎండీ పీకే పుర్వార్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయిస్తారని అంచనా వేస్తున్నట్టు తెలియజేశారు. ‘‘ఉద్యోగుల వేతనాలు దీపావళికి ముందే ఈ నెల 23, 24 నాటికి చెల్లిస్తాం. టెలికం రంగం సవాళ్లతో కూడిన దశలో ఉందని మనకు తెలుసు. పోటీ వల్ల టెలికం కంపెనీలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇతర సమస్యలూ ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. పునరుద్ధరణ ప్యాకేజీ ద్వారా దీనికి పరిష్కారం చూపనున్నాం’’ అని పుర్వార్‌ వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ప్రభుత్వం అనుమతి తెలిపితే... రూ.74 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తుల్ని విక్రయించడం ద్వారా దీన్ని రికవరీ చేసుకోవాలన్నది ప్రణాళిక.

మరిన్ని వార్తలు