వృద్ధి, సంస్కరణలకు ఊతం

12 Jul, 2014 02:07 IST|Sakshi

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్.. వృద్ధి, సంస్కరణలకు ఊతమిచ్చే విధంగా ఉందని విదేశీ బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించిందని జపాన్‌కి చెందిన నొమురా సంస్థ ప్రెసిడెంట్ వికాశ్ శర్మ పేర్కొన్నారు. నిధుల కొరత వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. మరిన్ని సంస్కరణలకు పునాది వేసే దిశగా మోడీ ప్రభుత్వపు తొలి బడ్జెట్ భారీ ప్రయత్నమే చేసినట్లుగా భావించవచ్చని బ్రిటన్ బ్రోకరేజి సంస్థ బార్‌క్లేస్ పేర్కొంది.

దీర్ఘకాలికంగా ఎకానమీ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడంపై బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి సారించారని ఆర్‌బీఎస్ ఇండియా సీనియర్ ఎకానమిస్టు గౌరవ్ కపూర్ తెలిపారు. పన్నుల విధానాల్లో పెద్దగా మార్పులు చేయకుండా.. ట్యాక్సులపరంగా స్పష్టతనిచ్చే ప్రయత్నాన్ని ఆర్థిక మంత్రి చేశారని ఆయన చెప్పారు. అయితే, బడ్జెట్ అంత గొప్పగా ఏమీ లేదని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని బీఎన్‌పీ పారిబా వ్యాఖ్యానించింది. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్ పునాది వేసినట్లుగా భావించవచ్చని పేర్కొంది.

 ఇక, ద్రవ్య లోటును జీడీపీలో 4.1 శాతానికి తగ్గించుకోవాలన్నది చాలా పెద్ద లక్ష్యమేనని, ప్రస్తుత సబ్సిడీల వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని ఎస్‌బీఐ ఒక రీసెర్చ్ నివేదికలో తెలిపింది. బడ్జెట్‌లో విప్లవాత్మకమైన మార్పులేమీ లేకపోయినా .. సరైన దిశలో అర్థవంతమైన అడుగులతో ఆశలను సజీవంగా ఉంచగలిగిందని స్టాన్‌చార్ట్ అభిప్రాయపడింది.

 లక్ష్యాలు కష్టసాధ్యం: రేటింగ్ ఏజెన్సీలు
 ఓవైపు అంతంత మాత్రం ఆదాయం, మరోవైపు సబ్సిడీల భారం కారణంగా బడ్జెట్‌లో నిర్దేశించుకున్నట్లుగా ద్రవ్య లోటు కట్టడి వంటి లక్ష్యాలు కష్టసాధ్యమేనని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.5 శాతాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. ఆదాయం సమకూర్చుకోవడం, వ్యయాలు కట్టడి చేసుకోవడంపై బడ్జెట్‌లో స్పష్టత లేనందువల్ల భవిష్యత్‌లో ద్రవ్య లోటు లక్ష్యాలను ఏ విధంగా సాధించగలరన్నది అంచనా వేయడం కష్టసాధ్యంగా ఉంటుందని మూడీస్ ఒక నివేదికలో తెలిపింది. అయితే, ద్రవ్య లోటు తగ్గితే.. ప్రభుత్వానికి నిధులపరమైన ఊరట లభించడంతో పాటు దేశ సార్వభౌమ రేటింగ్ మెరుగుపడగలదని పేర్కొంది.

మరిన్ని వార్తలు