విలువైన బ్రాండ్ టాటా

19 Feb, 2014 01:26 IST|Sakshi
విలువైన బ్రాండ్ టాటా

 లండన్: భారత దేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ గ్లోబల్ టాప్ 500  బ్రాండ్ జాబితాలో 2,110 కోట్ల డాలర్ల విలువతో టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని(భారత్ వరకూ) ఈ ఏడాది కూడా నిలుపుకుంది. గత ఏడాది 39వ స్థానంలో ఉన్న టాటా బ్రాండ్ ఈ ఏడాది 34వ స్థానానికి ఎగబాకింది.  ఈ జాబితాలో  భారత కంపెనీలు గత ఏడాది ఆరు ఉండగా, ఈ ఏడాది ఈ సంఖ్య 5కు పడిపోయింది. ఒక్క టాటా మినహా మిగిలిన నాలుగు సంస్థల ర్యాంక్‌లు ఈ ఏడాది తగ్గాయి. అంతర్జాతీయ జాబితాలోని ఇతర భారత కంపెనీలు ఎస్‌బీఐ (347వ స్థానం), ఎయిర్‌టెల్(381), రిలయన్స్ ఇండస్ట్రీస్(413), ఇండియన్ ఆయిల్(474), ఈ జాబితాలో ఈ ఏడాది చోటు దక్కించుకోలేని కంపెనీగా ఐటీసీ నిలిచింది.
 మూడోసారీ యాపిలే
 ఇక ఈ జాబితాలో 10,500 కోట్ల డాలర్లతో యాపిల్ బ్రాండ్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. అగ్రస్థానంలో యాపిల్ నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది.   7,900 కోట్ల డాలర్లతో శామ్‌సంగ్ రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజాన్, జీఈ, ఏటీఅండ్‌టీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఐబీఎంలు నిలిచాయి. ఇక అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఫెరారి నిలిచింది. ఈ గ్లోబల్ జాబితాలో అమెరికా బ్రాండ్లు ఎక్కువగా(185) ఉన్నాయి.

మరిన్ని వార్తలు