పసిడిపై దిగుమతి సుంకం తగ్గింపు?

6 Feb, 2015 00:53 IST|Sakshi
పసిడిపై దిగుమతి సుంకం తగ్గింపు?

బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్‌లో  2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.  దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

దేశ ఎగుమతుల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో ఈ రంగం నుంచి ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా (2013 డిసెంబర్‌తో పోల్చితే) 1.2 శాతం క్షీణించి (మైనస్) 2.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.  దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నవంబర్‌లో 152 టన్నుల పసిడి దిగుమతులు డిసెంబర్‌లో 39 టన్నులకు పడిపోయాయి.
 
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని 2- 4 శాతం శ్రేణిలో తగ్గించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో క్యాడ్ 4 శాతానికి పైగా పెరిగి, డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 68 వరకూ బలహీనపడిన పరిస్థితుల్లో పసిడి దిగుమతులపై  కేంద్రం 10  శాతానికి  సుంకాలను పెంచింది. ఆభరణాల విషయంలో ఈ దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. దీనితో అంతర్జాతీయంగా పసిడి ధర దిగివచ్చినా, ఆ ప్రభావం దేశంలో కనబడలేదు. ఒక దశలో 10 గ్రాములకు ప్రీమియం (దేశీయ-అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం) రూ.3 వేలకు పైగా కనబడింది. దీనితో దేశంలోకి బంగారం అక్రమ రవాణా పెరుగుతూ వస్తోంది.

మరిన్ని వార్తలు