‘రీట్స్’ పెట్టుబడులొస్తున్నాయ్!

1 Mar, 2016 02:20 IST|Sakshi
‘రీట్స్’ పెట్టుబడులొస్తున్నాయ్!

స్థిరాస్తి రంగంలో తీరనున్న నగదు కొరత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్థిరాస్తి రంగానికి రీట్లు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) రూపంలో మంచి రోజులు రానున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సక్సెస్ అయిన రీట్ల విధానాన్ని మన దేశంలోనూ ఆరంభించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రీట్స్ పెట్టుబడులు పొందేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న డివెడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను తొలగిస్తున్నామని, దీర్ఘకాలిక మూలధనంపై పన్ను విధానాన్ని కూడా హేతుబద్దీకరిస్తున్నామని, అలాగే ప్రస్తుతం  ఆదాయం పన్ను మినహాయింపుల్లో భాగంగా ఇస్తున్న ఇంటి అద్దె మినహాయింపులను కూడా రూ.24,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో వివరించారు. దీంతో చాలా కాలంగా స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న నగదు కొరత రీట్ల రూపంలో తీరనుందని కొలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా సీనియర్ అసోసియేట్ డెరైక్టర్ (రీసెర్చ్) సురభి అరోరా, నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్, వంటి స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు. అసలు రీట్లు అంటే ఏంటి? అవెలా పనిచేస్తాయంటే..

 రీట్స్‌తో మ్యూచుఫల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే రీట్స్‌కూ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి.

 రీట్లు స్టాక్ ఎక్స్ఛెంజ్‌లో నమోదవుతాయి. అక్కడే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిదారులకు మంచి లాభాలు గిట్టుబాటయ్యే అవకాశముంది. నిర్మాణం పూర్తయిన వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల్ని పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు అందించడమే రీట్ల ప్రధాన కర్తవ్యం. అంటే అద్దెల రూపంలోనే ఆదాయం గిట్టుబాటవుతుందన్నమాట. దేశ, విదేశీ సంస్థలకు చెందిన నిధుల ప్రవాహం పెరిగితే వాణిజ్య సముదాయాలకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుంది.

 రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్‌ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది.

 మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను మినహాయింపు వుంటుంది. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు.

>
మరిన్ని వార్తలు