‘అప్పు’డే రేటింగ్‌ పెంచలేం!

3 Feb, 2017 00:20 IST|Sakshi
‘అప్పు’డే రేటింగ్‌ పెంచలేం!

అప్‌గ్రేడ్‌ చేయడానికి భారీ ప్రభుత్వ రుణమే అడ్డంకి...
బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి
ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌(ఎస్‌అండ్‌పీ) వ్యాఖ్యానించింది. అయితే, కొండంత ప్రభుత్వ రుణ భారం, బలహీనంగా ఉన్న పన్ను ఆదాయాలు... రేటింగ్‌ పెంపుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టిన బడ్టెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018–19కి ఈ లోటును 3 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016–17)లో ద్రవ్యలోటు 3.5%గా ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్య లోటుగా పరిగణిస్తారు. ‘ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుచుకునే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను బడ్జెట్‌ కళ్లకుకట్టింది. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) కారణంగా సమీపకాలంలో వృద్ధి రేటు దెబ్బతింటున్నప్పటికీ భారత్‌ ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రాముఖ్యం ఇస్తోంది’ అని ఎస్‌అండ్‌పీ పేర్కొంది.

జీడీపీలో 68.5 శాతానికి రుణభారం...
భారత ప్రభుత్వ రుణ భారం ప్రస్తుతం జీడీపీతో పోలిస్తే 68.5 శాతంగా ఉంది. 2016 సెప్టెంబర్‌ చివరినాటికి విదేశీ రుణ భారం 484.3 బిలియన్‌ డాలర్లు (రూ.32.93 లక్షల కోట్లు.. జీడీపీలో 24 శాతం). దీనికి అంతర్గత రుణాలు కలిపితే 68.5 శాతంగా లెక్కతేలుతుంది. ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌ఆర్‌బీఎం) సమీక్ష కమిటీ నివేదిక ప్రకారం 2023 నాటికి జీడీపీలో రుణ భారాన్ని 60 శాతానికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని బడ్జెట్‌లో జైట్లీ ప్రస్తావించారు. కాగా, ఆర్థిక, విధానపరమైన సంస్కరణలు గణనీయంగా మెరుగుపడిన పక్షంలో రుణ భారం 60 శాతం దిగువకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇది భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ పెరిగేందుకు రానున్న కాలంలో సానుకూలాంశంగా నిలుస్తుందని కూడా వెల్లడించింది.

అయితే, ప్రస్తుతానికైతే అధిక రుణ భారం, బలహీన పన్ను ఆదాయాలు రేటింగ్‌ పెంచేందుకు కీలకమైన అడ్డంకులని స్పష్టం చేసింది. ఎస్‌అండ్‌పీ ప్రస్తుతం భారత్‌కు ‘బీబీబీ మైనస్‌’ రేటింగ్‌(స్థిర అవుట్‌లుక్‌తో) ను కొనసాగిస్తోంది. ఇది జంక్‌ గ్రేడ్‌కు(పెట్టుబడులకు అత్యంత కనిష్టస్థాయి గ్రేడ్‌) ఒక్క అంచె మాత్రమే ఎక్కువ. ఈ ఏడాది(2017)లో భారత్‌ రేటింగ్‌ను పెంచే ప్రసక్తే లేదని 2016 నవంబర్‌లో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. జీడీపీలో రుణ భారాన్ని 60 శాతం దిగువకు తీసుకువచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. అదేవిధంగా మధ్యకాలానికి ద్రవ్యలోటు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గేవిధంగా ప్రభుత్వ పన్ను ఆదాయాలేవీ పెరుగుతాయని భావించడం లేదని పేర్కొంది.

బ్యాంకులకు రూ.10 వేల కోట్లేనా?
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు మూలధనం కిందం ఈ బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను మాత్రమే కేటాయించడంపై ఎస్‌అండ్‌పీ పెదవి విరిచింది. ఇది ఏమాత్రం సరిపోదని.. దీనివల్ల బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం విషయంలో(బ్యాలెన్స్‌ షీట్ల క్లీన్‌అప్‌) జాప్యం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా లోటును బ్యాంకులు బీమా కంపెనీలు.. ఇతర ప్రభుత్వ సంస్థలు లేదంటే క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి సమీకరించుకోవాల్సిందేనని ఎస్‌అండ్‌పీ సీనియర్‌ డైరెక్టర్‌(ఆర్థిక సంస్థల రేటింగ్స్‌ విభాగం) గీతా చుగ్‌ పేర్కొన్నారు.

అవసరమైతే మరిన్ని మూలధన నిధులను ఇస్తామంటూ ఆర్థిక మంత్రి జైట్లీ హామీనివ్వడం కాస్త ఊరటనిచ్చే విషయమని ఆమె చెప్పారు. కాగా, కొన్ని బ్యాంకులు అత్యంత బలహీనంగా ఉన్నాయని.. టేకోవర్‌ లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని చుగ్‌ హెచ్చరించారు. బాసెల్‌–3 నిబంధనల ప్రకారం 2019 చివరినాటికి దేశీ బ్యాంకింగ్‌ రంగానికి రూ.2.5 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయనేది ఎస్‌అండ్‌పీ అంచనా. కాగా, 2015లో మోదీ సర్కారు ప్రకటించిన ‘ఇంద్రధనుష్‌’ కార్యాచరణ కింద నాలుగేళ్లలో పీఎస్‌బీలకు రూ.70,000 కోట్ల మూలధనం ఇవ్వాలనేది ప్రణాళిక. దీనిలో భాగంగా గడిచిన తొలి రెండేళ్లలో(2015–16, 16–17) రూ.25 వేల కోట్ల చొప్పున కేంద్రం కేటాయించింది.

మరిన్ని వార్తలు