సిమెంటుకు తయారీ మంట!

24 Jun, 2014 00:50 IST|Sakshi
సిమెంటుకు తయారీ మంట!

భారంగా విద్యుత్, బొగ్గు, రవాణా చార్జీలు
- తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంపు
- ధర పెంచకపోతే ప్లాంట్ల మూసివేతే
- రైల్వే చార్జీలతో మరోసారి పెంచాల్సివస్తోంది
- ‘సాక్షి’తో సిమెంటు కంపెనీల ప్రతినిధులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయం అంతకంతకూ పెరుగుతుండడంతో సిమెంటు కంపెనీలకు పాలుపోవడం లేదు. ముడి పదార్థాలు, విద్యుత్, బొగ్గు, రవాణా వ్యయాలు, బ్యాంకు వడ్డీలు ఏడాదికేడాది భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో సిమెంటు తయారీ వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు ప్లాంట్లు మూతపడ్డాయి.

ఈ పరిస్థితుల్లో ధర పెంచకపోతే మరిన్ని ప్లాంట్ల మూసివేత తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధర పెంచక తప్పలేదని పేర్కొంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు రైల్వే సరుకు రవాణా చార్జీలు తాజాగా 6.5 శాతం పెరిగాయి. పరిశ్రమకు మరింత భారం పడ్డట్టేనని, దీని ప్రభావంతో మరోసారి ధర పెంచక తప్పదని కంపెనీలు అంటున్నాయి.
 
దూసుకెళ్తున్న వ్యయం..
సిమెంటు తయారీకి రూ.155-165, ఎక్సైజ్ పన్ను రూ.41, వ్యాట్ రూ.46, రవాణా రూ.55-80 కలుపుకుంటే మొత్తం వ్యయం ఒక్కో బస్తాకు రూ.297-332 అవుతోంది. దీనికి హ్యాండ్లింగ్ చార్జీలు, డీలర్/ఏజెంట్ కమిషన్ అదనం. భారీ పెట్టుబడితో కూడుకున్న రంగం కాబట్టి బస్తా అమ్మకం ధర రూ.300 లోపు ఉంటే కంపెనీలకు నష్టమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించి వేశాయి. అయితే స్థిర వ్యయాలైన తరుగుదల, వడ్డీ, పరిపాలన తదితర వ్యయాలు మిగిలిన ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో సిమెంటు ధర పెరిగేందుకు ఒక కారణమవుతోంది.

మూడేళ్లలో విద్యుత్ చార్జీలు 70% దాకా పెరిగాయి.  ఇక నాణ్యమైన బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండోనేసియా నుంచి దిగుమతైన బొగ్గు టన్నుకు నాలుగేళ్ల క్రితం రూ.4 వేలుంటే, నేడు రూ.5 వేలకు చేరుకుంది. దేశీయ బొగ్గు కొరత కారణంగా టన్నుకు రూ.3,750 నుంచి రూ.5,500లకు చేరిం ది. డీజిల్ లీటరుకు రూ.44 నుంచి రూ.61కి చేరింది. దీంతో సిమెంటు ధర కూడా హెచ్చించాల్సివస్తోందని కంపెనీలు వాపోతున్నాయి.
 
పొరుగు రాష్ట్రాల కంటే తక్కువే..
సమైక్య రాష్ట్రంలో గతేడాది జూలై ప్రాంతంలో సిమెంటు ధర బస్తాకు (50 కిలోలు) రకాన్నిబట్టి రూ.320 దాకా వెళ్లింది. అది కాస్తా తర్వాతి నెలల్లో రూ.200-235కు వచ్చి చేరింది. సిమెంటుకు గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణం. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల వచ్చింది. సీమాంధ్ర, తెలంగాణలో ఒక దశలో బస్తా ధర రూ.340 దాకా వెళ్లినప్పటికీ తిరిగి రూ.300-325 మధ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉత్తరాదితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఒక్కో బస్తాకు రూ.380 వరకు ధర ఉందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమిళనాడులో రూ.370-380, కేరళలో రూ.370, కర్ణాటకలో రూ.350 వరకు ఉందని పేర్కొన్నారు.

అటు మహారాష్ట్రలోనూ ధరలు పెరిగాయి. ఈ రాష్ట్రాల కంటే ఇక్కడే ధర తక్కువగా ఉందని ఆయన తెలిపారు. తయారీ వ్యయాలు ఎగుస్తున్నందునే ధరల్ని వాటికి అనుగుణంగా స్థిరీకరణ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాజాగా పెరిగిన రైల్వే సరుకు చార్జీల ప్రభావంతో సిమెంటు ధర ఒక్కో బస్తాకు రూ.10 వరకు పెరగనుందని పేర్కొన్నారు. 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో చాలా కంపెనీలు నష్టాలను చవిచూడడాన్నిబట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి అద్ధం పడుతుందని ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.
 
అనిశ్చితి కారణంగా..
గత మూడేళ్లుగా సమైక్య రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఈ కారణంగా సిమెంటుకు ఆయువు పట్టు అయిన నిర్మాణ రంగం కుదేలైంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులే దని చెప్పారు. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలూ ఏవీ జరగలేదు. దీంతో సిమెంటుకు గిరాకీ లేకుండా పోయిందని ఓ కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు