అన్ని వర్గాలకూ అన్యాయం

13 Mar, 2015 02:45 IST|Sakshi
అన్ని వర్గాలకూ అన్యాయం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అన్ని వర్గాల వ్యతిరేక బడ్జెట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. మాటల గారడీ తప్ప సరైన కేటాయింపులు జరగలేదని ధ్వజమెత్తింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు షేక్ బేపారి అంజాద్ బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు.. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 1.13 కోట్ల బడ్జెట్‌లో మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వికలాంగులకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే కేటాయించారని బాషా విమర్శించారు. మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయిస్తే, ఏపీ బడ్జెట్‌లో కేవలం రూ.370 కోట్లు కేటాయించారన్నారు. ఎస్సీలకు తెలంగాణలో రూ.6 వేల కోట్లు కేటాయించగా.. ఇక్కడ రూ.2123 కోట్లు, ఎస్టీలకు అక్కడ రూ.3,300 కోట్లు కేటాయించగా ఏపీలో రూ.990 కోట్లు కేటాయించారని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు కేటాయించినా.. అందులో రూ.1,600 కోట్లు పట్టిసీమకు పోతే మిగిలేవి రూ.3 వేల కోట్ల పైచిలుకేనన్నారు. ఈ కేటాయింపులు పెంచేంత వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని చెప్పారు. ఈ వర్గం ఆ వర్గం అని చూడకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇదని చెవిరెడ్డి విమర్శించారు. కీలకమైన అంశాలకు నామ మాత్రపు కేటాయింపులే జరిగాయని, నిరుద్యోగ భృతి, అంగన్‌వాడీల జీతాల పెంపు వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. సంక్షేమ రంగానికి కూడా  భారీ కోత పెట్టమే కాకుండా అన్ని వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. 10 జిల్లాల తెలంగాణ ప్రభుత్వానికంటే 13 జిల్లాల ఏపీ తన బడ్జెట్‌లో చాలా తక్కువ కేటాయింపులు జరిగాయని చెప్పారు.

ఏ మంత్రికీ సబ్జెక్ట్‌పై అవగాహన లేదు..
బడ్జెట్‌కు ముందు కూడా చెవిరెడ్డి మీడియా పాయింట్‌లో మాట్లాడారు. చంద్రబాబు కేబినెట్‌లోని ఏ మంత్రికీ సబ్జెక్ట్‌పై అవగాహన లేదని, ఒక మంత్రిని అడిగితే మరో మంత్రి సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అడిగినదానికి సరిగ్గా చెప్పలేక వైఎస్సార్‌సీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు ఎందుకు ఈ అసమర్ధ మంత్రులను పెట్టుకున్నట్టని ప్రశ్నించారు.

సభలో అధికార పక్షం హుందాగా వ్యవహరించాలని, తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శించడం మంచి సంప్రదాయం కాదని సూచించారు. రాష్ట్రంలో 7.95 లక్షల ఇళ్లు పూర్తి చేశామంటున్నారని.. తొమ్మిది నెలలవుతుంటే ఒక ఇటుక కట్టడం కాదు కదా, ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. కాంట్రాక్టర్లకు రూ. 395 కోట్లు బకాయిలున్నాయని చెప్పారు. శాసనసభ సాక్షిగా గవర్నర్‌తో అబద్దాలు చెప్పిస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
 

మరిన్ని వార్తలు