అసలు బుల్ మార్కెట్ ముందుంది..!

23 Oct, 2014 00:56 IST|Sakshi
అసలు బుల్ మార్కెట్ ముందుంది..!

* ఇది ట్రయల్ మాత్రమే: ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
* కమోడిటీ ధరలు ఇక పతనమే 80 డాలర్లలోపే చమురు ధరలు
* ఆయిల్ షేర్లపై దృష్టి... పెట్టుబడికి ఓఎన్‌జీసీ అత్యుత్తమం

ముంబై: ఈ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దేశీ స్టాక్ మార్కెట్లలో అసలుసిసలు బుల్ దశ మొదలైందంటూ వ్యాఖ్యానించారు. ఇది మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ అంటూ  చెప్పిన రాకేష్ దీపావళి సందర్భంగా ఒక చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి మార్కెట్లపై అత్యంత ఆశావహంగా స్పందించారు. బిగ్‌బుల్‌గా ప్రసిద్ధులైన రాకేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... ‘దేశీ స్టాక్ మార్కెట్ సినిమాలో ట్రయిలర్ మాత్రమే మొదలైంది. అసలు సినిమా ముందుంది. అయితే తీవ్ర కరెక్షన్‌లకు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్ మార్కెట్లో దిద్దుబాట్లు సహజం’.
 
ఇప్పుడే చెప్పలేం
మోడీ ప్రభుత్వం పనితీరుపై ఇప్పుడే వ్యాఖ్యానించలేం. మనది ప్రజాస్వామ్య దేశం. మార్పులు సహజం. అయితే ఆరు నెలల్లోనే మోడీ అద్భుతాలు చేస్తారని ఆశించడం తప్పు. అయితే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు కనిపించే అవకాశముంది. చమురు ధరలు లేదా కమోడిటీల పతనానికి అందరూ అనుకంటున్నట్లు వినియోగం తగ్గడం కారణంకాదు. గత 15ఏళ్లలో కమోడిటీ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నడిచింది. ప్రస్తుతం ఇది అంతమైనట్లే. ఇకపై కమోడిటీల్లో భారీ దిద్దుబాటు(కరెక్షన్) జరిగే అవకాశముంది. అంతేకాదు. ఇది బేర్ ట్రెండ్‌కు దారితీయొచ్చుకూడా. పతనమవుతున్న చమురు ధరలు బ్యారల్‌కు 70-80 డాలర్ల ధరలో స్థిరపడే అవకాశముంది. నా అంచనా ప్రకారం దీర్ఘకాలంపాటు ఇదే స్థాయిలో ధరలు కొనసాగవచ్చు.
 
ఆయిల్ షేర్లు భేష్
ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ లబ్దిపొందనున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఓఎన్‌జీసీ పట్ల బుల్లిష్‌గా ఉన్నాను. ఇప్పటికే ఓఎన్‌జీసీలో ఇన్వెస్ట్ చేశాను కూడా. 2016 తరువాత ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని పూర్తిగా తొలగించే అవకాశముంది. ఇందువల్ల ఆయిల్ ధరల పతనం నుంచి బాగా లాభపడేది ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా అని చెప్పొచ్చు.
 
అంచనా వేయలేం
దేశీ మార్కెట్లు సాధించబోయే వృద్ధి పట్ల నేను చూపుతున్న ఆశావహ థృక్పథానికి బిగ్‌బుల్, మ్యాడ్‌బుల్ అని పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు. అయితే సైక్లికల్ అప్‌ట్రెండ్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో వ్యవస్థాగత బుల్‌ట్రెండ్ కనిపించనుంది. 2017-18 తరువాత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని సాధించనుంది. ఇది ఎన్నేళ్లు కొనసాగుతుందన్నది అంచనా వేయలేం.
 
విదేశీ అంశాల ఎఫెక్ట్ తక్కువే
కమోడిటీల పతనం, ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు వంటి సమస్యలను ప్రస్తుతం ధనిక దేశాలు ఎదుర్కొంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశమెక్కడ ఉంది? ఒకవేళ పెంచినా ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే. ఇండియా గరిష్ట స్థాయిలో వృద్ధి సాధించనున్న దేశం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయ్. సంస్కరణలు పుంజుకుంటే పెట్టుబడుల వెల్లువెత్తుతాయ్.
 రేర్ ఎంటర్‌ప్రజైస్ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే రాకేష్ గత ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలపై ఇటీవల ఒక పత్రిక లెక్కకట్టింది. ట్రేడింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి గంటకూ రాకేష్ రూ. 35 లక్షలు సంపాదించారంటూ పేర్కొంది.

మరిన్ని వార్తలు