మరింత ఆలస్యం కానున్న బుల్లెట్‌ ట్రైన్‌..?

12 Jun, 2018 12:25 IST|Sakshi

ముంబై : ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌’ మరింత ఆలస్యం కానునట్లు సమాచారం. జపాన్‌ దేశ సహకారంతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం భూ సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భూ సేకరణ అంత సులభంగా సాధ్యమయ్యేలా కనపడటంలేదని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ముంబై - అహ్మదాబాద్‌ మార్గంలో రూపొందనున్న ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ కారిడార్లో ఐదోవంతు భాగం అనగా 108 కి.మీ. విస్తీర్ణం పాల్గార్‌ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం ముఖ్యంగా మామిడి, సపోట వంటి పండ్ల తోటలకు ప్రసిద్ధి. దాంతో ఈ భూములను వదులుకోవడానికి పాల్గార్‌ రైతులు సుముఖంగా లేరు.

భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు కూడా పలు షరతులు విధిస్తున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అడగ్గా...మరికొందరు ప్రస్తుత మార్కెట్‌ విలువ కంటే 50శాతం ఎక్కువ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రైతుల వద్ద నుంచి భూమిని సేకరించడం తమ వల్ల కాదంటూ నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) అధికారులు చేతులేత్తాసారు. దాంతో ప్రభుత్వం ఈ విషయం గురించి చర్చించడానికి భారతీయ రైల్వేకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులను నియమించినట్లు సమాచారం. అయితే పాల్గార్‌ రైతులు మాత్రం బలవంతంగా తమ భూములను లాక్కుంటే నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

వచ్చే ఏడాది పాల్గార్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మిగితా రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలుపుతుకన్నాయి. ‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని...ఈ ప్రాజెక్ట్‌ కోసం వెచ్చించే సొమ్మును మన రైల్వేలను అభివృద్ధి పర్చడం కోసం వినియోగిస్తే మంచిద’ని వాదిస్తున్నాయి. ఈ వియషం గురించి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో - ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ) అధికారి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడు​కల నాటికి అనగా 2022, ఆగస్టు 15 నాటికి ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. 2023 నుంచి ఈ బుల్లెట్‌ ట్రైన్‌ వినియోగంలోకి రావాలిని ఒప్పందం. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి భూ సేకరణ జరగాలి. కానీ భూ సేకరణకు రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ విషయం గురించి మేము భారతీయ రైల్వే అధికారులతో చర్చించినప్పడు వారు ఇదేమంత పెద్ద విషయం కాదు మేము చూసుకుంటామన్నా’రని తెలిపారు. 

మోదీ ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా...కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో 17 బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇండియా జపాన్‌ నుంచి 50 ఏళ్ల కాలపరిమితితో అధిక మొత్తంలో రుణం తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు