మ్యాక్స్ బూపా హెల్త్‌లో 49%కి ‘బూపా’ వాటా

6 Jan, 2015 01:40 IST|Sakshi
మ్యాక్స్ బూపా హెల్త్‌లో 49%కి ‘బూపా’ వాటా

బీమాలో ఎఫ్‌డీఐ వాటా పెంచాక తొలి డీల్  ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో విదేశీ కంపెనీల వాటాను పెంచుకోవడానికి ఆర్డినెన్స్ జారీ చేసిన తరవాత... ఆ అవకాశాన్ని వినియోగించుకున్న తొలి కంపెనీగా బ్రిటన్‌కు చెందిన బూపా రికార్డులకెక్కింది. మాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రస్తుతమున్న 26 శాతం వాటాను 49 శాతానికి బూపా పెంచుకుంది. దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకుంది.

ఇండియాకు చెందిన మాక్స్ గ్రూపుతో కలిసి బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాకలాపాలు కొనసాగిస్తుండటం తెలిసిందే. ఈ వాటా పెంపు భారతీయ మార్కెట్‌పై తమకున్న నమ్మకాన్ని తెలియచేస్తోందని బూపా మేనేజింగ్ డెరైక్టర్ (ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్స్) డేవిడ్ ఫ్లెచ్చర్ చెప్పారు. ఈ నిధులతో దేశీయ ఆరోగ్య బీమా సేవలు మరింతగా విస్తరించడంతో పాటు, బూపా వ్యాపార విస్తరణ సులభమవుతుందన్న  ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నరేంద్ర మోడీ వచ్చిన ఆరు నెలల్లోనే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు వంటి కీలక సంస్కరణలను అమలు చేయడంపై మ్యాక్స్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ ఖోస్లా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మ్యాక్స్ బూపాకు దేశవ్యాప్తంగా 16 పట్టణాల్లో 26 కార్యాలయాలున్నాయి. 3,500 ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి.

మరిన్ని వార్తలు