పార్లమెంటులో... ‘బిజినెస్‌’

29 Mar, 2017 00:27 IST|Sakshi
పార్లమెంటులో... ‘బిజినెస్‌’

సామాజిక సేవపై రూ.5,857 కోట్లు 400 కంపెనీల వ్యయం
న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత పథకం (సీఎస్‌ఆర్‌) కింద 400 కంపెనీలు రెండేళ్ల కాలంలో రూ.5,857 కోట్లను ఖర్చు చేశాయి. ఈ విషయాన్ని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభకు వెల్లడించారు. కంపెనీల చట్టం –2013 కింద నిర్దేశిత స్థాయిలో లాభాలను ఆర్జించే కంపెనీలు తమ మూడేళ్ల సగటు వార్షిక లాభాల్లో రెండు శాతాన్ని సామాజిక బాధ్యత కింద వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది.

ఈ నిబంధన 2014 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2015–16 సంవత్సరంలో 172 కంపెనీలు నిబంధనల మేరకు రూ.2,660 కోట్లను సామజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా రూ.3,360 కోట్లను వెచ్చించాయి. 2014–15లో 226 కంపెనీలు రూ.2,497 కోట్లను వ్యయం చేశాయి. కానీ, నిబంధనల మేరకు రూ.3,499 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. సామాజిక బాధ్యత పథకాన్ని అమలు చేసే విషయంలో కంపెనీల దుర్వినియోగంపై తమ శాఖకు ఎటువంటి సమాచారం లేదని మంత్రి పేర్కొన్నారు.

బిట్‌ కాయిన్లు చట్ట వ్యతిరేకం: కేంద్రం
బిట్‌ కాయిన్లు తరహా వర్చువల్‌ కరెన్సీ (డిజిటల్‌ రూపంలో ఉండేవి) వినియోగం చట్ట విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని ఆర్‌బీఐ గుర్తించలేదని, వీటి కొనుగోళ్లు, లావాదేవీలు మనీలాండరింగ్‌ వ్యతిరేక చట్టం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. వర్చువల్‌ కరెన్సీ వాడకం వల్ల తలెత్తే ఆర్థిక, చట్టపరమైన, భద్రతా ముప్పు గురించి ట్రేడర్లను, వాటిని వినియోగించేవారిని ఆర్‌బీఐ ఇప్పటికే హెచ్చరించిట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. చెల్లింపుల కోసం బిట్‌ కాయిన్‌ తరహా వర్చువల్‌ కరెన్సీల సృష్టికి ఏ సెంట్రల్‌ బ్యాంకు కూడా అనుమతించలేదన్నారు.

నిర్వహణ లాభాల్లోకి ఎయిర్‌ ఇండియా!
ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించే ఆలోచనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.300 కోట్ల మేర నిర్వహణ పరమైన లాభాలను ఆర్జించనుందని పౌర విమానయాన శాఖా సహాయ మంత్రి జయంత్‌ సిన్హా రాజ్యసభకు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ నిర్వహణ పరమైన నష్టాలు తగ్గుతూ వస్తున్నాయని, అవే లాభాలుగా మారుతున్నాయన్నారు.

మూడేళ్లుగా నష్టాల్లోనే 43 కేంద్ర సంస్థలు
మూడేళ్లుగా (2013–16) 43 కేంద్ర సంస్థలు (సీపీఎస్‌ఈ) నష్టాలతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎయిర్‌ ఇండియా, బీఎస్‌ఎన్‌ఎల్,  బ్రిటిష్‌ ఇండియా కార్పొరేషన్, హిందుస్థాన్‌ యాంటీబయోటిక్స్‌  వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉన్నాయి. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాబుల్‌ సుప్రియో ఈ విషయం తెలిపారు.  వనరుల కొరత, సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం, తీవ్రమైన పోటీ,  నిర్వహణ లోపం ఇందుకు కారణాలని వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా