సేవల రంగంలో కుదుపు

6 Mar, 2018 00:12 IST|Sakshi

ఆరు నెలల కనిష్టానికి బిజినెస్‌ సూచీ

ఫిబ్రవరిలో 47.8గా నమోదు

న్యూఢిల్లీ: సేవల రంగం ఫిబ్రవరిలో పడకేసింది. వృద్ధి ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ జనవరిలో 51.7  ఉండగా ఫిబ్రవరిలో 47.8కి తగ్గింది. గతేడాది ఆగస్ట్‌ తర్వాత చూస్తే ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదవడం మళ్లీ ఇదే. కీలకమైన 50 మార్కును దిగిరావడం మూడు నెలల్లో ఇదే తొలిసారి. డిమాండ్‌ బలహీనంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు రావటం తగ్గిపోయినట్టు ఈ సూచీని నిర్వహించే ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సంస్థ తెలిపింది. అయితే, రానున్న 12 నెలల కాలానికి సంస్థలు ఆశాభావంతో ఉండటం సానుకూలం.

‘‘వృద్ధి క్షీణత తాత్కాలికమేనని సంస్థలు భావిస్తున్నాయి. వృద్ధి అంచనాలకు అనుగుణంగా 2011 జూన్‌ నుంచి చూస్తే ఉద్యోగుల నియామకం ఎంతో వేగంగా ఉంది’’ అని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనామిస్ట్‌ ఆష్నా దోధియా పేర్కొన్నారు. ఇక సేవలు, తయారీ రంగాలకు సంబంధించిన నికాయ్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ సైతం ఫిబ్రవరిలో 49.7కి క్షీణించింది. జనవరిలో ఇది 52.5గా ఉంది. సేవల రంగం తిరోగమనమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. ముడి సరుకుల ద్రవ్యోల్బణం కూడా గతేడాది నవంబర్‌ తర్వాత పెరిగినట్టు ఈ సంస్థ తెలిపింది.   

మరిన్ని వార్తలు