వాళ్లు చెప్పరు! మీరే అడగాలి!

11 Dec, 2017 01:47 IST|Sakshi

బీమా పాలసీలపై అవగాహన తప్పనిసరి

సంప్రదాయ పాలసీల్లో కొన్ని వివరాలు గోప్యం!

బోనస్, బీమా రక్షణ, రాబడుల గురించి తెలుసుకోవాలి

బీమాలో రాబడులెప్పుడూ పరిమితంగానే ఉంటాయి

బీమాలో కవరేజీకే ప్రాధాన్యమివ్వాలి తప్ప రాబడికి కాదు  

‘‘ప్రీమియం చాలా తక్కువ. 10 ఏళ్లు కడితే చాలు. చక్కని నిధి చేతికందుతుంది. పన్ను ఆదా చేసుకోవచ్చు...’’ ఇవీ చాలా మంది బీమా ఏజెంట్లు చెప్పే మాటలు. ఏజెంట్ల ద్వారా బీమా తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మాటలు వినే ఉంటారు. ఎందుకంటే సంప్రదాయ బీమా పాలసీలను విక్రయించటానికి ఏజెంట్లు ఇలా తియ్యటి మాటలు చెప్పటం సర్వసాధారణం.

ఎన్నెన్నో గణాంకాలు కూడా వినిపిస్తుంటారు. కాకపోతే కొన్ని గణాంకాలను కావాలనే దాచిపెడతారు. వారు చెప్పిన విషయాలన్నీ కరెక్టే కావచ్చు!! కానీ కావాలని చెప్పనివి కూడా కొన్ని విషయాలుంటాయి. అలాంటివన్నీ స్వయంగా తెలుసుకోవాల్సిందే. అప్పుడే బీమా పాలసీ సరైనదో, కాదో తెలుసుకుని ఒక నిర్ణయానికి రాగలం. అందుకే... పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలియజేసేదే ఈ కథనం... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

బీమా కంపెనీల వ్యాపారంలో అత్యంత కీలకమైనవి ఎండోమెంట్‌ పాలసీలే. ఇక యూనిట్‌ లింక్డ్‌ పాలసీలు (యులిప్‌), పొదుపుతో కూడిన బీమా రక్షణ పథకాలు సంప్రదాయ పాలసీల్లో భాగంగా ఉంటాయి. ఈ సంప్రదాయ పాలసీల్లోనే పార్టిసిపేటింగ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్లు ఉంటాయి. పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో పాలసీదారులు బీమా కంపెనీ చేసిన పెట్టుబడులపై వచ్చిన లాభాలను పొందుతారు. బోనస్‌ రూపంలో కంపెనీలు దీన్ని పంచుతాయి.

నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో కచ్చితమైన హామీతో కూడిన రాబడులుంటాయి. నిజానికి సంప్రదాయ పాలసీల్లో రిస్క్‌ కవరేజీ చాలా తక్కువ. జీవితానికి తగిన రక్షణ కావాలని అనుకునేవారికి ఇవి తగినవి కానే కావు. వీటికి కట్టే ప్రీమియానికి మహా అయితే 10 రెట్ల బీమా రక్షణ లభిస్తుంది. ఇలా కాకుండా కేవలం బీమా రక్షణే కోరుకుంటే (టర్మ్‌పాలసీ) తక్కువ ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ లభిస్తుంది. సంప్రదాయ పాలసీల విషయంలో పాలసీ పత్రాలపై సంతకం చేసే ముందు తెలుసుకోవాల్సినవి ఇవే.


ఛార్జీలు ఎంతో తెలుసా?
సంప్రదాయ పాలసీల్లో ప్రీమియం అలోకేషన్‌ చార్జీ గురించి పాలసీదారులకు తెలిసింది తక్కువే. అలాగే, పరిపాలనా వ్యయాలు, మోర్టాలిటీ చార్జీలు కూడా గోప్యంగానే ఉంచుతారు. స్థూల, నికర రాబడులను బెనిఫిట్‌ ఇలస్ట్రేషన్‌ (బీఐ) నుంచి వేరు చేస్తే ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. 

ఏజెంట్లు సరెండర్‌ చార్జీల గురించి అస్సలు ప్రస్తావించరు. సంప్రదాయ పాలసీల్లో సరెండర్‌ (పాలసీ వద్దని వెనక్కి ఇచ్చేయడం) చార్జీలు చాలా ఎక్కువ. పాలసీ తీసుకున్న తర్వాత తొలినాళ్లలో చెల్లించిన ప్రీమియంలో 70 శాతం వరకూ నష్టపోవాల్సి వస్తుంది. కాల వ్యవధి ముగింపుకు దగ్గర్లో సరెండర్‌ చేస్తే తక్కువ మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. పాలసీ పత్రాల్లో సరెండర్‌ చార్జీల ప్రస్తావన ఉంటుంది. కానీ, ఏజెంట్లు ఈ విషయాల గురించి దాదాపుగా చెప్పరు.

బోనస్‌ గురించి తెలుసుకోవాలి...
పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో బోనస్‌ గ్యారంటీగా వస్తుందని ఏజెంట్లు చెప్పే మాటల్ని నమ్మొద్దు. నిజానికి బోనస్‌ రూపంలో వచ్చే రాబడి ఒక శాతం ఐఆర్‌ఆర్‌ మాత్రమే. బీమా కంపెనీలు పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో తమ పెట్టుబడి నిధి వృద్ధి చెందితేనే బోనస్‌ను ప్రకటించాలి. కనుక పెట్టుబడులపై రాబడులు వచ్చిన సంవత్సరాల్లోనే బోనస్‌ వస్తుందని ఆశించొచ్చు. అలాగే, రాబడుల ఆధారంగా ఈ బోనస్‌ రేటు కూడా ఏటేటా మారిపోవచ్చు.

బోనస్‌ రేటు అన్నది వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో అధిక శాతం రాబడులను డెట్‌ విభాగంలోనే ఇన్వెస్ట్‌ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బీమా కంపెనీల బోనస్‌ రేటు కూడా తగ్గుతోంది. 2014లో ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు 9 శాతంగా ఉంటే, ప్రస్తుతం అవి 6.8 శాతంగా ఉన్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సేవింగ్స్‌ సురక్షా పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌లో 2014లో 2.25 శాతంగా ఉన్న బోనస్‌ రేటు 2017లో 1.75 శాతానికి తగ్గింది.

సమ్‌ అష్యూర్డ్‌లో నిర్ణీత శాతం చొప్పున బోనస్‌ను బీమా కంపెనీలు ప్రకటిస్తుంటాయి. సాధారణంగా రెండు రకాల బోనస్‌లుంటాయి. రివర్షనరీ బోనస్‌ అనేది ఏటా బీమా కంపెనీ ప్రకటిస్తుంది. టెర్మినల్‌ బోనస్‌ మరొకటి. పాలసీని సరెండర్‌ చేసినా లేక కాల వ్యవధి తీరినా, పాలసీదారుడు మరణించిన సమయాల్లో చెల్లించేది టెర్మినల్‌ బోనస్‌. పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత సమ్‌ అష్యూర్డ్‌తో పాటు, జీఏ, రివర్షనరీ బోనస్, టెర్మినల్‌ బోనస్‌ చెల్లించడం జరుగుతుంది.

అసలైన రాబడి ఎంత?
సంప్రదాయ పాలసీల గురించి ఏజెంట్లు చెప్పే గొప్పల్లో ముఖ్యమైంది చెల్లించిన ప్రీమియం రెట్టింపు అవుతుందని. కానీ, ఇందులో వాస్తవం వేరు. నిజానికి చాలా వరకు నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఎండోమెంట్‌ పాలసీలపై నికర రాబడులు 4– 5 శాతం మధ్యే ఉంటాయి. మరే ఇతర సంప్రదాయ పథకంలోనూ ఇంత తక్కువ రాబడులుండవు. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సంచయ్‌ అనేది నాన్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌.

45 సంవత్సరాల వ్యక్తి ఏటా రూ.1.50 లక్షల చొప్పున పదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే 20వ సంవత్సరం ముగింపులో రూ.28 లక్షలు చేతికి అందుతాయి. ఇందులో వాస్తవ రాబడి 4 శాతమే. మెచ్యూరిటీ తీరిన తర్వాత చేతికందే మొత్తం గురించే చెబుతుంటారు కానీ... ఏటా ప్రీమియం రూపంలో ఎంతమేర చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని వివరంగా చెప్పరు. ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (అంతర్గత రాబడి రేటు) అన్నది ఎండోమెంట్‌ పాలసీల్లో వాస్తవ రాబడులు తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎన్నో కాలిక్కులేటర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

రాబడిపై చెప్పేవన్నీ గొప్పలే...
పొదుపుతో కూడిన బీమా పథకాల్లో ఇన్వెస్టర్లను ఆకర్షించేది గడువు తీరాక వచ్చే రాబడులే. పార్టిసిపేటింగ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ పథకాల్లో పాలసీ డాక్యుమెంట్‌లో భాగంగా బెనిఫిట్‌ ఇలస్ట్రేషన్‌ (బీఐ) కూడా ఉంటుంది. అంటే పాలసీదారుడు మరణిస్తే తన నామినీకి ఎంత మొత్తం అందుతుంది... లేక జీవించి ఉంటే గడువు తీరిన తర్వాత ఏ మేర ప్రయోజనం అందుతుంది... వంటి వివరాలు అందులో ఉంటాయి. నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో మెచ్యూరిటీ బెనిఫిట్‌ అన్నది పూర్తిగా హామీతో కూడినది.

పెట్టుబడుల విలువ కాల వ్యవధి ముగింపు నాటికి ఎంతకు చేరుతుందన్న వివరాలు బీఐలో ఉంటాయి. పార్టిసిపేటింగ్‌ ప్లాన్ల విషయంలో బీమా కంపెనీ 4 శాతం రాబడుల ప్రకారం అయితే ఎంతొస్తుంది, 8 శాతం రాబడులు అయితే ఎంత లభిస్తుందన్న రెండు రకాల అంచనాలను వివరిస్తుంది. అయితే, ఈ గణాంకాలను చూసి అంత మేర వస్తాయని నిశ్చయమైపోవటం కరెక్టు కాదు. ఇవి కేవలం అంచనాలే కానీ, బీమా కంపెనీ ఇస్తున్న హామీతో కూడిన రాబడులు మాత్రం కాదు.

జీవన్‌ సరళ్‌ కూడా అలాంటిదే...
ఇలా గొప్పలు చెప్పిన పాలసీల్లో ఎల్‌ఐసీకి చెందిన జీవన్‌ సరళ్‌ను కూడా ఉదహరించొచ్చు. ఇది ఆరంభమైన సమయంలో ఏజెంట్లు చెప్పిన గొప్పలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి స్టాక్‌ మార్కెట్‌ రాబడులను ఉదహరిస్తూ కొందరైతే ఏకంగా 12–15 శాతం వార్షిక రాబడులను అంచనా వేసి పాలసీలు కట్టించారు. కట్టే వార్షిక ప్రీమియానికి ఏకంగా పాతిక రెట్ల బీమా రక్షణ లభిస్తుందని, వార్షిక రాబడులు భారీగా ఉంటాయి కనుక పదేళ్లు కడితే విపరీతమైన లాభాలొస్తాయని చెప్పారు.

నిజానికి ఈ పాలసీలో రాబడులనేవి పదేళ్ల తరవాతే మొదలవుతాయనే విషయాన్ని మాత్రం చాలా మంది పాలసీదారులు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే పాలసీ ఆరంభమై ఇప్పటికి తొమ్మిదేళ్లు కావస్తుండగా... చాలామంది దీన్ని సరెండర్‌ చేసేశారు. చిత్రమేంటంటే 8 ఏళ్లు ప్రీమియం కట్టి సరెండర్‌ చేసిన వారికి కూడా... కనీసం వారు చెల్లించిన మొత్తం చేతికి రాలేదు. పదేళ్లు పూర్తయితే అప్పటిదాకా కట్టిన మొత్తం ప్రీమియంపై ఓ 4–5 శాతం రాబడి రావచ్చనేది ప్రస్తుతం ఉన్న అంచనా.

నిజానికి ఈ తొమ్మిదేళ్లు ప్రీమియం కట్టిన వారు అప్పట్లోనే బీమా రక్షణ కోసం టర్మ్‌ పాలసీ తీసుకుని ఉంటే... కట్టే ప్రీమియంలో 10 శాతానికే ఈ పాలసీ ఇచ్చినంత రక్షణ ఆ పాలసీ కూడా ఇచ్చేది. మిగతా 90 శాతం సొమ్మును బ్యాంకు ఆర్‌డీ, మ్యూచ్‌వల్‌ పండ్స్‌ ఇలా దేన్లో ఇన్వెస్ట్‌ చేసినా ఆ సొమ్ము రెట్టింపు అయ్యేది. ఇవన్నీ అర్థం చేసుకునేనేమో!! చాలామంది ఇప్పటికే ఈ పాలసీని సరెండర్‌ చేసేశారు. ధీరేంద్రకుమార్‌ వంటి నిపుణులు సైతం దీన్ని రాబడుల విషయంలో పూర్తి సందిగ్ధత ఉన్న పాలసీగా పేర్కొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వ్యయాలు తెలుసుకునేందుకే బీఐ!
పైన చెప్పిన ఉదాహరణ బట్టి చూసినా... వాస్తవ రాబడులన్నవి అంచనాలపై కాకుండా బీమా కంపెనీ పెట్టుబడులపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో కచ్చితంగా ఎంతొస్తుందన్నది ముందుగా చెప్పలేం. బీమా కంపెనీలు తమ పెట్టుబడులపై వచ్చే రాబడి ఆధారంగా వార్షికంగా బోనస్‌ను ప్రకటిస్తాయి. దీన్ని బట్టే రాబడులుంటాయి. కాకపోతే పార్టిసిపేటింగ్‌ ప్లాన్లలో వ్యయాలు తెలుసుకునేందుకు బీఐ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 8 శాతం రాబడుల అంచనాల పాలసీలో ఐఆర్‌ఆర్‌ అన్నది 5 శాతంగా ఉంటుంది. అంటే మూడు శాతం వ్యయాల రూపంలో పోతుంది. దీన్నే ఎక్స్‌పెన్స్‌ రేషియోగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

రాబడులు పరిమితమే...
సంప్రదాయ పాలసీలు అధిక రాబడులను ఇవ్వలేవు. ఎందుకంటే అవి డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ ఆస్తుల్లో సగం మేర ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ ఆమోదిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. 15 శాతాన్ని ఆమోదిత హౌసింగ్, ఇన్‌ఫ్రా బాండ్లలో పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతమే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. కాబట్టి వీటికి రాబడులు పరిమితంగానే ఉంటాయన్నది గుర్తించాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!

నేడే మెగా విలీనం

రిలీఫ్‌ ర్యాలీ..!

మీ ఈఎంఐ కట్‌ చేయొద్దా?

హానర్‌ కొత్త ఫోన్‌ ‘30ఎస్‌’

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది