బ్యాంకులకు రూ.70,000 కోట్ల షాక్‌

8 Aug, 2018 00:57 IST|Sakshi

బిజినెస్‌ @ పార్లమెంట్‌

న్యూఢిల్లీ: మోసాల కారణంగా దేశీయ బ్యాంకులు గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.70,000 కోట్ల మేర నష్టపోయాయి. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు 2015–16లో రూ.16,409 కోట్లు, 2016–17లో రూ.16,652 కోట్లు, 2017–18లో రూ.36,694 కోట్ల మేర నష్టాలను చవిచూశాయి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్‌ శుక్లా రాజ్యసభకు తెలిపారు. ఈ మోసాలన్నీ కూడా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో జరిగినవని కాకుండా, నమోదైనవిగా స్పష్టం చేశారు.  

ఇక షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల రుణాలు 2008 మార్చి నాటికి రూ.25.03 లక్షల కోట్లుగా ఉంటే, 2014 మార్చి 31 నాటికి రూ.68.75 లక్షల కోట్లకు పెరిగిపోయినట్టు మంత్రి సభకు వివరించారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలకు అత్యుత్సాహంతో కూడిన రుణ జారీ విధానాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలు, రుణ మోసాలు, కొన్ని కేసుల్లో అవినీతి, ఆర్థిక మందగమనం కారణాలుగా వివరించారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం ఎన్‌పీఏల్లో రూ.1,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న వారు 139 మంది ఉన్నట్టు మంత్రి ప్రతాప్‌శుక్లా తెలిపారు.  
కొత్తగా 2 లక్షల మంది ఐటీ రిటర్నులు
2017–18 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2.09 లక్షల మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేశారని, రూ.6,416 కోట్ల మేర పన్నులు చెల్లించారని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ప్రతాప్‌ శుక్లా రాజ్యసభకు తెలిపారు. డీమోనిటైజేషన్‌ తర్వాత రూ.10 లక్షలు అంతకుమించి రిటర్నులు దాఖలు చేసిన 3.04 లక్షల మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయగా, గడువు లోపు వారు తమ ఆదాయం వివరాలతో రిటర్నులు దాఖలు చేయలేదని చెప్పారు. ఈ విధమైన వ్యక్తులను గుర్తించిన ఫలితంగా రిటర్నులు పెరిగి, అదనపు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. పరోక్ష పన్ను వసూళ్లు 18 శాతం పెరిగి రూ.10.03 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు.  

100 గిగావాట్ల సోలార్‌ విద్యుత్తు
దేశంలో 2022 నాటికి సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 100 గిగావాట్లను సులభంగానే సాధించే స్థితిలో ఉన్నట్టు కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే 23.12 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటైనట్టు విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ రాజ్యసభకు తెలిపారు. 2017 జూలై నాటికి కర్ణాటక రాష్ట్రం 5.16 గిగావాట్ల సామర్థ్యంతో అగ్ర స్థానంలో ఉండగా, 3.4 గిగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ, 2.56 గిగావాట్ల సామర్థ్యంతో ఏపీ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు మంత్రి చెప్పారు.

టెక్స్‌టైల్స్‌ దిగుమతులపై సుంకాల పెంపు
దేశీయ టెక్స్‌టైల్‌ రంగానికి జవసత్వాలను నింపే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 328 ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను 20 శాతానికి పెంచింది. దేశీయంగా వీటి తయారీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ లోక్‌సభకు సమర్పించారు.

కస్టమ్స్‌ చట్టం 1962లోని సెక్షన్‌ 159 కింద 328 ఉత్పత్తులపై ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 20 శాతానికి చేస్తున్నట్టు ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తాజా సుంకాల పెంపుతో దేశీయ ఉత్పత్తులు చౌకగా మారతాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం గత నెలలోనూ 50 టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తులపై సుంకాలను 20 శాతానికి పెంచడం గమనార్హం.

మరిన్ని వార్తలు