రూ. 20 కడితే ఆధార్‌ సర్వీసులు

8 Mar, 2019 05:19 IST|Sakshi

ఈ–కేవైసీ కోసం వ్యాపార సంస్థలకు యూఐడీఏఐ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: కస్టమర్‌ ధ్రువీకరణ కోసం (కేవైసీ) ఆధార్‌ సర్వీసులు వినియోగించుకోవాలంటే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్‌కు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీ ధృవీకరణ కోసం 0.50 పైసలు చెల్లించాల్సి రానుంది. విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డుల సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘ఆధార్‌ ధృవీకరణ సర్వీసులకోసం ప్రతి ఈ–కేవైసీ లావాదేవికి రూ. 20 (పన్నులు సహా), ఇతరత్రా ప్రతి లావాదేవీ ధృవీకరణ (యస్‌ లేదా నో) కోసం రూ. 0.50 (పన్నులు సహా) చెల్లించాల్సి ఉంటుంది. అని పేర్కొంది. ‘ఆధార్‌ లేకుండా కేవైసీ ధృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు రూ. 150–200 దాకా ఖర్చవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఆధార్‌ ఆధారిత కేవైసీ ధృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దీంతో సౌలభ్యం దృష్ట్యా ఆధార్‌ ఆధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది‘ అని అధికారిక వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్‌ ప్రకారం..  

► ఆధార్‌ సేవలను వినియోగించుకున్నాక ఇన్‌వాయిస్‌ వచ్చిన 15 రోజుల్లోగా వ్యాపార సంస్థలు నిర్దేశిత మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన పక్షంలో నెలకు 1.5 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ–కేవైసీ సేవలు కూడా
నిల్చిపోతాయి.  

► ఇప్పటికే ఆధార్‌ ఆధారిత ధృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు.. తాజా నోటిఫికేషన్‌ విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్‌ ఆర్డినెన్స్‌కు సవరణల కారణంగా ఆధార్‌ ఆథెంటికేషన్‌ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లవుతుందని వివరించాయి. అయితే, ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది.

► ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్‌ సేవలు అందిస్తునన్న షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులకు ఆథెంటికేషన్‌ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ లక్ష్యాలను అవి చేరలేకపోతే.. టార్గెట్‌కి తగ్గట్లుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు