నలుగురు కలిసి విమానం కొనండి

8 Mar, 2018 00:39 IST|Sakshi
‘గెట్‌ సెట్‌ గో’ వ్యవస్థాపకురాలు కనికా టేక్రివాల్‌

‘జెట్‌ సెట్‌ గో’ ఫౌండర్‌ కనికా టేక్రివాల్‌ 

నిర్వహణ మా చేతుల్లో పెట్టండి

 బ్యాంకు రుణానికి సహకరిస్తాం

రూ.5 కోట్లకు 4 సీట్ల విమానం

 హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘సూపర్‌ ప్రీమియం కార్ల కోసం రూ.5 కోట్లకుపైగా వెచ్చించే కస్టమర్లు మన దగ్గర ఎక్కువే. ఇదే ధరకు నాలుగు సీట్ల చిన్న విమానమొస్తుంది. దాన్ని కొనండి. అద్దెకు తిప్పి మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాం. పూర్తి నిర్వహణ బాధ్యత మాదే’’ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు ‘గెట్‌ సెట్‌ గో’ వ్యవస్థాపకురాలు కనికా టేక్రివాల్‌. తమ సంస్థ ద్వారా క్యాబ్‌ మాదిరి ప్రైవేట్‌ విమాన సేవలందిస్తున్న కనికా... నలుగురు స్నేహితులు కలిసైనా ఓ బుల్లి జెట్‌ను కొనుక్కోవచ్చన్నారు. మున్ముందు భారత ప్రైవేటు విమానయాన రంగంలో అనూహ్య వృద్ధి ఉండబోతోందని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిశ్రమ తీరుతెన్నులు, కంపెనీ ప్రణాళికలు ఆమె మాటల్లోనే..

బ్యాంకు నుంచి రుణం..
విమానం కొనుగోలుకు ముందుకొచ్చిన వ్యక్తులకు ఇతరత్రా అంశాలతో పాటు బ్యాంకు రుణాల్లోనూ సహకరిస్తాం. నాలుగు సీట్ల విమానానికి కనీసం రూ.5 కోట్లు అవుతుంది. ప్రైవేట్‌ జెట్‌ సేవలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. మూడేళ్లలో డిమాండ్‌ రెండింతలకు చేరనుంది. ప్రపంచవ్యాప్తంగా 400 పైగా విమానాశ్రయాలకు సర్వీసులందిస్తున్నాం. భారత్‌లో 190 విమానాశ్రయాల్లో అడుగు పెట్టాం. జెట్‌ సెట్‌ గో ద్వారా బుకింగ్‌కు 100 విమానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 20 కంపెనీలు, వ్యక్తులకు చెందిన 32 విమానాల్ని మేం నిర్వహిస్తున్నాం. పైలట్లతో సహా కంపెనీ సిబ్బంది 160 మంది ఉన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేశాం. విమానం ఎగిరే ముందు ప్రతిసారి 29 రకాల భద్రతా పరీక్షలు నిర్వహిస్తాం.  

సొంత విమానాలు..
డిసెంబరులో మా సొంత విమానం అడుగు పెట్టబోతోంది. 8 సీట్ల ఈ విమానానికి రూ.75 కోట్లు వెచ్చిస్తున్నాం. రెండేళ్లలో 8–10 విమానాలను సొంతంగా సమకూర్చుకోవాలన్నది మా ధ్యేయం. ఇందుకోసం ఈ ఏడాదే రూ.190–250 కోట్లు సమీకరిస్తున్నాం. విదేశీ ఇన్వెస్టర్‌ ఒకరు ఆసక్తి కనబరిచారు. ఇటీవలే ఇండో పసిఫిక్‌ ఏవియేషన్‌ను సుమారు రూ.65 కోట్లకు కొనుగోలు చేశాం. ఈ కంపెనీ వద్ద రెండు ఫ్లయిట్స్‌ ఉన్నాయి. హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో మా సంస్థకు ఎనిమిది ఆఫీసులున్నాయి. కంపెనీలో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్, వ్యాపారవేత్త పునీత్‌ దాల్మియా పెట్టుబడి పెట్టారు. 

హైదరాబాద్‌ నుంచే షటిల్‌..
జెట్‌ సెట్‌ గో ద్వారా పూర్తి విమానాన్ని బుక్‌ చేసుకోవాలి. జెట్‌ స్టీల్స్‌ కింద విడివిడిగా టికెట్లు కొనుక్కోవచ్చు. జెట్‌ షటిల్‌ పేరు తో నూతన సర్వీసులను 4 నెలల్లో ప్రారంభిస్తున్నాం. మొదట హైదరాబాద్‌ నుంచి మొదలు పెడతాం. వైజాగ్, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలు, సందర్శనీయ స్థలాలకు షటిల్‌ సర్వీసులుంటాయి. ఒక్కో టికెట్‌ రూ.15–30 వేల మధ్య ఉంటుంది.

నాలుగో స్థానంలో భాగ్యనగరి..
ప్రైవేట్‌ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. భాగ్యనగరి నుంచి ప్రతిరోజు అయిదు సర్వీసులు నడుపుతున్నాం. ఏడాదిన్నరలో ఈ నగరం తొలి స్థానం కైవసం చేసుకోవడం ఖాయం. అంతలా ఇక్కడ డిమాండ్‌ ఉంది. వచ్చే రెండేళ్లు మా ఫోకస్‌ కూడా ఇక్కడే ఉండబోతోంది. మొత్తంగా జెట్‌ సెట్‌ గో నెలకు 600లకుపైగా బుకింగ్స్‌ నమోదు చేస్తోంది. ఇంధన వ్యయం పెరిగిన కారణంగా ఏప్రిల్‌ నుంచి ప్రైవేట్‌ జెట్స్‌ టికెట్ల ధర 4–12 శాతం పెరిగే ఛాన్స్‌ ఉంది.   

మరిన్ని వార్తలు