ఈక్విటీ, బిట్‌కాయిన్స్‌ నుంచి పోటీ..!

27 Nov, 2017 00:07 IST|Sakshi

వారంలో పసిడి 6 డాలర్ల క్షీణత!  

తగ్గినా... పటిష్టమేనంటున్న విశ్లేషణలు

ముంబై /న్యూయార్క్‌: అంతర్జాతీయంగా పసిడికి ప్రస్తుతం ప్రధానంగా ఈక్విటీలు, బిట్‌ కాయిన్‌ నుంచి గట్టి పోటీ ఏర్పడుతోందన్నది విశ్లేషకుల మాట. అందుకే రెండు వారాల పురోగతికి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ న్యూయార్క్‌ కమోడిటీ  ఎక్సే్ఛంజ్‌ నైమెక్స్‌లో ధర ఔన్స్‌ (31.1గ్రా)కు ఆరు డాలర్లు తగ్గి 1,288 డాలర్ల వద్ద ముగిసింది. ఒకపక్క  ఈక్విటీ మార్కెట్ల పరుగు కొనసాగుతుండగా, మరోపక్క బిట్‌కాయిన్‌ శుక్రవారం ఆల్‌టైమ్‌ హై 8,470.7 డాలర్ల స్థాయిని తాకింది. మరో క్రిప్టోకరెన్సీ ఇథీరియం ధర కూడా గరిష్టస్థాయి 485.19 డాలర్లను తాకడం గమనార్హం. ఈ రెండు కరెన్సీల విలువలు ఈ ఒక్క వారంలో దాదాపు  40 శాతం లాభపడ్డాయి. రానున్న వారంలో ఈక్విటీ విలువలతో పాటు క్రిప్టోకరెన్సీ విలువల ప్రభావం కూడా పసిడిపై ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. 

కన్సాలిడేషన్‌ దిశగా..!
ప్రస్తుతం 50 డాలర్ల శ్రేణిలో పసిడి కన్సాలిడేట్‌ అవుతోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఇటీవల అమెరికా ఫెడ్‌ సమావేశ వివరాలకు సంబంధించిన ‘మినిట్స్‌’ తాజా సమీక్షా వారంలో విడుదల కావడం... దీని ప్రకారం అమెరికా ద్రవ్యోల్బణం లక్ష్యాలకు అనుగుణంగా పెరగడం లేదన్న ఫెడ్‌ భయాలు.. ఈ నేపథ్యంలో ఫండ్‌ రేటు (ప్రస్తుతం 1–1.25 శాతం) ఇప్పట్లో పెంచే అవకాశం లేదన్న విశ్లేషణలు... వీటన్నిటికీ తోడు ఆరు కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ ఐదు నెలల కనిష్ట స్థాయికి పతనం (93.61 నుంచి 92.72) కావటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాలర్‌ పతనమైతే పసిడి బలపడుతుందన్న సాధారణ ధోరణికి భిన్నమైన ఫలితం గతవారం పసిడిలో ఏర్పడింది.

 అయితే 1,250 డాలర్ల స్థాయి లోపునకు పడిపోయేంత వరకూ పసిడి ఫండమెంటల్స్‌ పటిష్టంగానే ఉన్నట్లు భావించవచ్చనేది నిపుణుల అంచనా. అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఉత్తర కొరియా సహా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం పసిడిది బులిష్‌ ధోరణే అన్న అంచనాలకు బలాన్నిస్తాయని వారు చెబుతున్నారు. పన్నులకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు పసిడి కదలికలను నిర్దేశించే అంశాల్లో ముఖ్యమైనవి. 1,310 డాలర్లు, 1,325 డాలర్లు పసిడికి కీలకమని, ఈ నిరోధాన్ని దాటితే తిరిగి పుత్తడి పూర్తిస్థాయిలో బులిష్‌ జోన్‌లోకి వచ్చినట్లేనని వారు పేర్కొంటున్నారు. 

దేశంలోనూ డౌన్‌...
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా కనబడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌– ఎంసీఎక్స్‌లో వారంలో పసిడి ధర రూ.310 తగ్గి రూ.29,380కి చేరింది. ఇక ముంబై స్పాట్‌ మార్కెట్‌లో వారం వారీగా ధర స్వల్పంగా రూ.20 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.20 తగ్గి రూ. 29,590 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.29,440కి పడింది. ఇక వెండి ధర కేజీకి  రూ. 255 పడిపోయి రూ. 39,335 వద్ద ముగిసింది. కాగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వారంలో 46 పైసలు బలపడి 64.55కు చేరింది. 

మరిన్ని వార్తలు