అక్షయ తృతీయ : ఆఫర్లతో జర జాగ్రత్త..!

16 Apr, 2018 18:16 IST|Sakshi

న్యూఢిల్లీ : అక్షయ తృతీయ నాడు తప్పక ఎంతో కొంత బంగారాన్ని కొంటే మంచిదని నమ్ముతుంటారు భారతీయులు. అంత పవిత్రంగా భావించే ఈ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆఫర్లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండాలంటే బంగారం కొనే ముందు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వారు చెబుతున్న జాగ్ర‍త్తలేమిటో ఓసారి చూడండి...

నాణ్యత పరిశీలన...
బంగారాన్ని కొనే ముందు తప్పక దాని నాణ్యతను పరిశీలించి, దాని అసలు విలువను లెక్కించాలి. ప్రతి ఆభరణం మీద తప్పక బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ముద్ర, స్టాంపు, అది ఎన్ని క్యారెట్‌లు ఉన్నది, హాల్‌మార్కింగ్‌ సంవత్సరాన్ని కూడా చూడాలంటున్నారు

మేకింగ్‌ చార్జీలు...
ఈ పర్వదినం సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి పరిమిత కాలం వరకు మేకింగ్‌ చార్జీల మీద ఎక్కువ మొత్తంలొ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి బంగారం దుకాణాలు. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. కొనుగోలు చేయబోయే ఆభరణాల ఖరీదును కూడా వేర్వేరు దుకాణాల ధరలతో ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కో దుకాణంలో ఒక్కో రకమైన మేకింగ్‌ చార్జీలు ఉండటం వల్ల ఈ తేడా వస్తుంది. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు రెండు, మూడు షాపుల్లో ఆభరణాల ధరలను వాకబు చేసిన తర్వాత కొనుగోలు చేయడం ఉత్తమమంటున్నారు.

నాణాలు, బిస్కెట్లయితే మేలు...
బంగారాన్ని కొనేవారిలో ఎక్కువ మంది దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కొంటే మంచిది అని ఆలోచించి కొనడం మేలని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని పూర్తిగా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతోనే కొనాలనుకుంటున్నట్లయితే నాణేలు లేదా బిస్కెట్‌ రూపంలో కొనడం మంచిదని పేర్కొంటున్నారు.

రాళ్లు వద్దు..సాదానే ముద్దు..
రాళ్లు పొదిగిని ఆభరణాలను కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమంటున్నారు. సాదా ఆభరణాలతో పోలిస్తే, రాళ్లు పొదిగిన ఆభరణాలకు ఖరీదు ఎక్కువ. మేకింగ్‌ చార్జీలు కూడా అధికమే. రాళ్లు పొదిగిన ఆభరణాలను అమ్మాలనుకున్నా, మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు రాళ్ల ఖరీదును తీసివేసి బంగారానికి మాత్రమే విలువ కడతారు. ఈ రాళ్లు ఎంత ఖరీదైనవి అయినా కూడా కేవలం బంగారానికి మాత్రమే విలువ కడతారు కాబట్టి రాళ్లు పొదిగిన ఆభరణాలను కొనకపోవడమే ఉత్తమం అని నిపుణులంటున్నారు.

కాబట్టి ఈ సారి బంగారాన్ని కొనేముందు ఈ జాగ్రత్తలన్నింటని పాటిస్తే లాభాలన్నీ మీవే అంటున్నారు నిపుణులు.

మరిన్ని వార్తలు