క్యాబ్ చార్జీలు దిగొస్తున్నాయ్..

18 Nov, 2014 00:53 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రేడియో క్యాబ్ పరిశ్రమలో ధరల యుద్ధం కొనసాగుతోంది. ఆపరేటర్లు పోటీ పడి మరీ ధరలను తగ్గిస్తున్నారు. త్రిచక్ర వాహనాల కంటే చౌకగా కిలోమీటరుకు రూ.10 చార్జీ చేస్తున్నారు. రేడియో క్యాబ్స్ విస్తరించక ముందు కనీస చార్జీ రూ.400పైగా చెల్లించిన కస్టమర్లు.. కంపెనీల చార్జీల పోరుతో ఇప్పుడు రూ.50కే కారులో షికారు చేస్తున్నారు. హైదరాబాద్ రేడియో క్యాబ్ ఆపరేటర్ల వద్ద 8,000 దాకా వాహనాలు ఉన్నాయి. ఆపరేటర్లు రోజుకు 30 వేల పైచిలుకు ఫోన్ కాల్స్ అందుకుంటున్నారు. 2015 ద్వితీయార్థం నాటికి భాగ్యనగరంలో 40 వేలకుపైగా రేడియో క్యాబ్స్ రోడ్లపై పరుగులు తీస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

 ట్యాక్సీ కల్చర్ హవా..
 కోరిన సమయంలో ఇంటి ముందుకొచ్చే ఏసీ వాహనం. సురక్షిత ప్రయాణం. ఎక్కడ ఎక్కిందీ, దిగిందీ సమాచారమంతా కుటుంబ సభ్యులకు ఎస్‌ఎంఎస్ రూపంలో చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే రేడియో క్యాబ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. పారదర్శక ధరల విధానం కూడా డిమాండ్ పెరిగేలా చేస్తోంది.  క్యాబ్ అవసరమైతే చాలు స్మార్ట్‌ఫోన్ తీసి ఒక్క క్లిక్‌తో బుక్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో మేరూ క్యాబ్స్, జినీ, ఓలా, ఈజీ, స్కై, ఆరెంజ్, డాట్, యెల్లో, జీ, గ్రీన్, ట్యాక్సీ ఫర్ ష్యూర్ క్యాబ్స్ వంటి బ్రాండ్లు సేవలు అందిస్తున్నాయి.

 కనీస చార్జీ రూ.49..
 ఆపరేటర్ల మధ్య పోటీ పుణ్యమాని కనీస చార్జీలు ఊహించని స్థాయిలో పడిపోయాయి. హైదరాబాద్‌లో ట్యాక్సీ ఫర్ ష్యూర్ రూ.49 కనీస చార్జీతో మార్కెట్‌ను షేక్ చేసింది. 4 కిలోమీటర్ల వరకు ప్రయాణికులు రూ.49 చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు హ్యాచ్‌బ్యాక్ కార్లకు రూ.12 చార్జీ చేస్తోంది. ఓలా మినీ క్యాబ్‌లో రూ.100 కనీస చార్జీతో 4 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అదనంగా తిరిగితే కిలోమీటరుకు రూ.10 చెల్లించాలి. జినీ క్యాబ్స్‌లో రూ.200లతో 10 కిలోమీటర్లు, గ్రీన్‌క్యాబ్స్‌లో రూ.180లతో 8 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అయితే, నగరాలనుబట్టి ఈ రేట్లలో మార్పులు ఉంటాయి.

 డ్రైవర్లకు బోనస్..
 చిన్న కారుకు కిలోమీటరుకయ్యే వ్యయం రూ.12-14. తక్కువ చార్జీ, తక్కువ దూరం ప్రయాణం వల్ల క్యాబ్ డ్రైవర్లకు నష్టమేనని నగరానికి చెందిన ట్రావెల్స్ యజమాని ఎన్.శ్రీనివాస్ తెలిపారు. నష్టాన్ని పూరించడానికి కంపెనీలు డ్రైవర్లకు బోనస్ ఇస్తున్నాయని చెప్పారు. కొందరు ఆపరేటర్లు ఒక్కో కిలోమీటరుకు డ్రైవరుకు అదనంగా రూ.5 చెల్లిస్తున్నాయని ఒక కంపెనీకి చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. నష్టాలొచ్చినా బ్రాండ్  విలువను పెంచుకోవడానికే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్ల నిర్వహణ తీరు, బ్రాండ్ విలువను చూసే కస్టమర్లు చార్జీలను లెక్క చేయరని అన్నారు. ప్రధాన బ్రాండ్లకు కలిసొచ్చే అంశమిదేనని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు