ఎంటర్‌ప్రెన్యూర్లుగా క్యాబ్ డ్రైవర్లు

15 Sep, 2015 00:21 IST|Sakshi
ఎంటర్‌ప్రెన్యూర్లుగా క్యాబ్ డ్రైవర్లు

- ఓలా క్యాబ్ లీజింగ్ ద్వారా అవకాశం
న్యూఢిల్లీ:
క్యాబ్ లీజింగ్ వ్యాపారం ద్వారా డ్రైవర్లు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారే అవకాశాన్ని అందిస్తున్నామని ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ ఓలా పేర్కొంది. దీని కోసం క్యాబ్ లీజింగ్ వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని ఓలా వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు.  ఈ క్యాబ్ లీజింగ్ వ్యాపార విభాగం ఓలాకు పూర్తి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని వివరించారు. క్యాబ్ లీజింగ్ వ్యాపార విస్తరణ కోసం ఏడాది కాలంలో రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. ప్రారంభంలో రూ.500 కోట్లు పెట్టుబడులు పెడతామని, స్వతంత్రంగా నిధులు సమీకరిస్తామని వివరించారు. క్యాబ్ లీజింగ్ కార్యక్రమంలో  భాగంగా డ్రైవర్లు రూ.35,000 కనీస ప్రారంభ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని,  నెలవారీ రూ.15,000 చొప్పున లీజ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మూడేళ్ల తర్వాత ఆ కారు డ్రైవర్లు తమ సొంతం చేసుకునే ఆప్షన్ కూడా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంతో వేలాది మంది డ్రైవర్లు దీర్ఘకాలంలో నిలకడైన ఆదాయం సాధిస్తూనే కార్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని, డ్రైవర్లు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారే అవకాశం ఇదని పేర్కొన్నారు.  దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇంకా మూడు ఇతర నగరాల్లో వెయ్యికి పైగా కార్లు నడుస్తున్నాయని తెలిపింది. ఈ లీజింగ్ విధానంలో ఈ ఏడాది చివరికల్లా లక్ష కార్లను భాగంగా చేయాలని తమ లక్ష్యమని వివరించింది. కాగా ఈ క్యాబ్ లీజింగ్ వ్యాపార విభాగానికి లీజ్‌ప్లాన్ ఇండియా సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ రాహుల్ మరోలి  వైస్ ప్రెసిడెంట్(స్ట్రాటజిక్ సప్లై ఇనీషియేటివ్స్)గా పనిచేస్తారని వివరించారు.

మరిన్ని వార్తలు