ఎఫ్‌డీఐలపై కేంద్రం సంచలన నిర్ణయం

10 Jan, 2018 14:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీఐ పాలసీ సరళీకరణకు కేంద్రక్యాబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ముఖ్యంగా సింగిల్‌ బ్రాండ్‌ రీటైల్‌, నిర్మాణ రంగంలో  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు బార్ల తెరుస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.  విదేశీ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో  ఈ విధానాన్ని సడలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ఉద్యోగాలను సృష్టించడం, మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.  

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం పలు సవరణలకు ఆమోదం తెలిపింది.   సింగిల్ బ్రాండ్ రిటైల్ వర్తకం, నిర్మాణరంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర క్యాబినెట్ అనుమతినిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించింది. దీంతోపాటు ఎయిర్ ఇండియాలో విదేశీ ఎయిర్లైన్స్  49 శాతం వరకు పెట్టుబడి పెట్టేందుకు క్యాబినెట్‌ పచ్చజెండా  ఊపింది.  తద్వారా భారీగా పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగాలు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎఫ్‌డీఐ 17 శాతం పెరిగి 25.35 బిలియన్ డాలర్లకు చేరింది.

మరిన్ని వార్తలు