పన్నుల పరిష్కార పథకం పరిధి పెంపు...

13 Feb, 2020 06:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ’వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం పరిధిని విస్తరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్‌ కేసులను కూడా ఇందులోకి చేర్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 2019 నవంబర్‌ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంబంధిత వర్గాల సిఫార్సులకు అనుగుణంగా వివాద్‌ సే విశ్వాస్‌ బిల్లుకు కొత్త సవరణలను ప్రస్తుత పార్లమెంటు సెషన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు.

ఈ బిల్లు ప్రకారం పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు, 12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త మేజర్‌ పోర్ట్‌ అథారిటీ బిల్లు 2020కి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వా న్ని పెంచేందుకు ఇది తోడ్పడనుంది. ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు