పెద్ద కారు ఇక ప్రియం!

31 Aug, 2017 01:00 IST|Sakshi
పెద్ద కారు ఇక ప్రియం!

జీఎస్‌టీ సెస్సు 25 శాతానికి పెంపు...
ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం
ఆర్డినెన్స్‌ ద్వారా జీఎస్‌టీ చట్ట సవరణ


న్యూఢిల్లీ: పెద్ద కార్లపై సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి గరిష్టంగా 25 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో మధ్య, పెద్ద కార్లు, లగ్జరీ వాహనాలు, హైబ్రీడ్‌ వాహనాలు, స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ మొదలైన వాటి రేట్లు పెరగనున్నాయి. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం జూలై 1న అమల్లోకి వచ్చినప్పుడు పన్నుల శ్లాబుల్లో వ్యత్యాసాల కారణంగా లగ్జరీ కార్ల ధరలు సుమారు 3 శాతం దాకా తగ్గగా.. సాధారణంగా వినియోగించే పలు ఉత్పత్తుల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యత్యాసాలను సరిచేసే దిశగా గరిష్ట సెస్సు రేటును పెంచేందుకు జీఎస్‌టీ చట్టానికి ఆర్డినెన్స్‌ ద్వారా తగు సవరణలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. వివిధ వాహనాలపై వాస్తవ సెస్సు ఎంత ఉండాలి, ఎప్పట్నుంచి అమలవుతుంది అన్నది జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుందని వివరించారు. సెప్టెంబర్‌ 9న జైట్లీ సారధ్యంలో ఈ కౌన్సిల్‌ హైదరాబాద్‌లో భేటీ కానుంది. ప్రస్తుతం 28% జీఎస్‌టీకి అదనంగా పెద్ద కార్లపై 15% దాకా సెస్సు ఉంటోంది. ఇదే 25%కి పెరగనుంది.  

సామాన్యులకే ప్రయోజనం కలగాలి ..  
విలాసవంతమైన ఉత్పత్తులు ధరలు తగ్గేలాగా, నిత్యావసరాల ధరలు పెరిగేలా చేయడమనేది పన్ను విధాన ప్రధానోద్దేశం కాదని జైట్లీ స్పష్టం చేశారు. ‘ పన్ను ప్రయోజనం అనేది సామాన్యులకు ఉపయోగించే ఉత్పత్తులకు ఉండాలే తప్ప లగ్జరీ ఉత్పత్తులకు కాదు. రూ. 1 కోటి పెట్టి కారు కొంటున్న వారు రూ. 1.20 కోట్లు కూడా వెచ్చించి కొనుక్కోగలరు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు సిగరెట్స్‌పైనా సెస్సును పెంచడంపై స్పందిస్తూ.. సిగరెట్లను చౌకగా అందించడం జీఎస్‌టీ లక్ష్యం కాదని జైట్లీ స్పష్టం చేశారు. ‘ఒకవేళ అలాగే చేసి ఉంటే మతిలేని వ్యవహారంగా ఉండేది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. లగ్జరీ కేటగిరీ కింద అత్యధిక ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ వర్తించే కార్లపై తప్ప మిగతా వాటిపై రేటు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా చెప్పారు.

వృద్ధికి ప్రతికూలం: వాహన పరిశ్రమ
లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై సెస్సు పెంచాలన్న ప్రతిపాదన.. ఈ విభాగం వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మెర్సిడెస్‌–బెంజ్, ఆడి, జేఎల్‌ఆర్‌ తదితర ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘సెస్సు పెంపును హడావిడిగా అమలు చేయాలన్న‘ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. కనీసం ఆరు నెలలైనా ఆగి జీఎస్‌టీ ప్రభావంపై స్పష్టత వచ్చాక సమీక్ష జరిపి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాయి.

తగ్గి.. పెరిగిన పన్నులు...
జీఎస్‌టీ అమల్లోకి రాక మునుపు పెద్ద కార్లపై సేల్స్‌ ట్యాక్స్, సెస్‌ తదితరాలు కలిసి పన్ను రేటు 52–54.72% శ్రేణిలో ఉండేది. దీనికి సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్, ఆక్ట్రాయ్‌ మొదలైన వాటి రూపంలో అదనంగా మరో 2.5 శాతం వర్తించేది. అయితే, జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం పన్ను స్థాయి సుమారు 43%కి (28 శాతం జీఎస్‌టీతో 15% సెస్‌ కలిపి) దిగి వచ్చింది. దీంతో, ఎస్‌యూవీల ధరలు కూడా సుమారు రూ. 1–3 లక్షల మేర, కొన్ని లగ్జరీ కార్ల రేట్లు ఏకంగా రూ. 10 లక్షల దాకా కూడా దిగొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెస్సును పెంచాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆగస్టు 5న నిర్ణయించింది. ఇలా సెస్సుల రూపంలో వసూలైన మొత్తాన్ని జీఎస్‌టీ అమలుతో ఆదాయం నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం కింద చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగించనుంది.

మరిన్ని వార్తలు