దివాలా చట్ట సవరణలకు కేంద్రం ఓకే..

24 May, 2018 00:49 IST|Sakshi

ఆర్డినెన్స్‌పై క్యాబినెట్‌ ఆమోదముద్ర 

న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా దివాలా చట్టం (ఐబీసీ) సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో రుణాలిచ్చే ఇతరత్రా బ్యాంకులు, ఆర్థిక సంస్థల తరహాలోనే గృహాల కొనుగోలుదారులను కూడా ’ఆర్థిక రుణదాతల’ కింద వర్గీకరించేందుకు వీలు కానుంది. ఫలితంగా.. డిఫాల్ట్‌ అయ్యే కంపెనీల నుంచి వారు కూడా సత్వరం రీఫండ్‌లు పొందే వెసులుబాటు లభిస్తుంది. అలాగే, రుణాలిచ్చిన సంస్థలు .. బకాయీలను రాబట్టుకునే ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఈ మేరకు దివాలా చట్ట కమిటీ గత నెలలో చేసిన సిఫార్సులను ఈ ఆర్డినెన్స్‌లో పొందుపర్చినట్లు భావిస్తున్నారు. ఆర్డినెన్స్‌కి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. అయితే, రాష్ట్రపతి కూడా ఆమోదించే దాకా సవరణల గురించి వెల్లడించేందుకు లేదని ఆయన పేర్కొన్నారు. 2016 డిసెంబర్‌లో ఈ చట్టం అమల్లోకి రాగా.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసే బిడ్డర్ల అర్హతలకు సంబంధించిన మరిన్ని నిబంధనలతో నవంబర్‌లో కొత్తగా సెక్షన్‌ 29ఏ ని చేర్చారు.
 
కమిటీ సిఫార్సులు ..  
దివాలా చట్ట కమిటీ గత నెలలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు పలు సిఫార్సులు చేసింది. రియల్టీ సంస్థల దివాలా పరిష్కార ప్రక్రియలో గృహాల కొనుగోలుదారులు కూడా పాలుపంచుకునే అధికారాలు కల్పిస్తూ.. వారిని కూడా అప్పు ఇచ్చిన ఆర్థిక రుణదాతల కింద వర్గీకరించాలని సూచించింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకుండా చేతులెత్తేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచి గృహ కొనుగోలుదారులు తమ డబ్బును సత్వరం రాబట్టుకునేందుకు ఈ సిఫార్సు తోడ్పడనుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు