మరిన్ని బ్యాంకుల విలీనం: క్యాబినెట్‌ ఆమోదం

23 Aug, 2017 15:42 IST|Sakshi
మరిన్ని బ్యాంకుల విలీనం: క్యాబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనానికి కేంద్ర  క్యాబినెట్‌  ఆమోదం తెలిపింది.  బుధవారం జరిగిన  మంత్రివర్గ సమావేశంలో పీఎస్‌యూ బ్యాంకుల విలీనానికి  సూత్రప్రాయ అంగీకారం లభించింది.  ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్‌  జైట్లీ ప్రెస్‌మీట్‌లో వివరాలను వెల్లడించారు.

బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం, ఆర్థిక వృద్ది లక్ష్యాలతో  బ్యాంకుల విలీనానికి  క్యాబినెట్‌ ఇన్‌ ప్రిన్సిపల్‌ ఆమోదం తెలిపినట్టు  చెప్పారు.  చట్టప్రకారం, సెబి నిబంధనల ప్రకారం  ఆయా బ్యాంకులు తగు చర్యలు తీసుకుంటాయని జైట్లీ ప్రకటించారు. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంకోసం  ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని  క్యాబినెట్‌ ఏర్పాటు చేయనుంది. అలాగే  ఈ విలీన ప్రక్రియకోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడంపై  ప్రత్యామ్నాయ యంత్రాంగం చర్చలు నిర్వహిస్తుంది. ఎస్సెట్‌ క్వాలిటీ, మూలధన సంపద నిష్పత్తి, బ్యాంకుల లాభాలు,  స్థానం ఆధారంగా ఈ విలీనం  చోటు చేసుకోనుంది.

మరోవైపు ఈ వార్తలతో స్టాక్‌మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభపడ్డాయి.  ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌,  దెనా బ్యాంక్‌,  యూకో , కెనరా, అలహాబాద్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకింగ్‌  షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో బ్యాంక్‌ నిఫ్టీ కూడా హై పాయింట్‌  వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 
కాగా ఇటీవలి నెలల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టనున్నబ్యాంకుల మెర్జర్‌ ప్రణాళికలపై చాలా అంచనాలు నెలకొన్నాయి.  వేగవంతమైన ఆర్థిక విస్తరణకు మద్దతుగా  విస్తృత బ్యాంకింగ్ రంగ సంస్కరణలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు