బీమాలో 49% ఎఫ్‌డీఐకి ఓకే

25 Jul, 2014 00:49 IST|Sakshi
బీమాలో 49% ఎఫ్‌డీఐకి ఓకే

న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. తద్వారా ఈ రంగంలోకి రూ.25 వేల కోట్ల విదేశీ నిధుల రాకకు మార్గం సుగమం చేసింది. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ రంగంలో 26 శాతానికి మించిన పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతి అవసరమనీ, యాజమాన్య అజమాయిషీ మాత్రం భారతీయ ప్రమోటర్ల చేతుల్లోని ఉంటుందనీ పేర్కొన్నాయి.

 నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి ప్రధాన సంస్కరణ ఇదే. రక్షణ, రైల్వేల వంటి రంగాల్లోని ఎఫ్‌డీఐ పరిమితులను సడలిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేబినెట్ ఆమోదించిన బీమా చట్టాల (సవరణ) బిల్లును ఇక పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఇవే నిబంధనలు పెన్షన్ రంగానికి కూడా వర్తిస్తాయి. దేశంలో లైఫ్, నాన్ లైఫ్ రంగాల్లో ప్రస్తుతం రెండు డజన్లకు పైగా ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు ఉన్నాయి. బీమా రంగానికి పెట్టుబడులు అవసరమనీ, కనుక ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచుతామనీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
 సర్వత్రా హర్షం...
 యాజమాన్యాన్ని భారతీయుల చేతిలో ఉంచుతూనే ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడంవల్ల ఈ రంగానికి అత్యంత అవసరమైన దీర్ఘకాలిక నిధులు వస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం బహుముఖ ప్రభావం చూపుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్
 
 బీమా రంగ అభివృద్ధి పునరుద్ధరణకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీ మెరుగుపడుతుంది. - అమితాబ్ చౌదరి, ఫిక్కీ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్
 
 బీమా రంగ సరళీకరణతో మోడీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందనే సందేశం గ్లోబల్ ఇన్వెస్టర్లకు వెళ్తుంది. దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంటు పునరుద్ధరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది. - రాణా కపూర్, అసోచామ్ అధ్యక్షుడు
 
 భారతీయ ప్రమోటర్ల యాజమాన్య అజమాయిషీపై తగినంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మరో రూ.25 వేల కోట్ల వరకు అదనపు విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది. - శశ్వత్ శర్మ, కేపీఎంజీ (ఇండియా) భాగస్వామి
 
  పెట్టుబడుల సెంటిమెంటు పునరుద్ధరణకు ఎఫ్‌డీఐ పరిమితి పెంపు ఎంతగానో దోహదపడుతుంది. - శరద్ జైపురియా, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు
 
 ఎఫ్‌డీఐ పెంపునకు కేబినెట్ ఆమోదముద్రతో బీమా రంగానికి ఎంతో అవసరమైన దీర్ఘకాలిక మూలధనం సమకూరుతుంది.  - రాజేశ్ సూద్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ

మరిన్ని వార్తలు