సామాన్యుడికీ విమానయోగం!

16 Jun, 2016 00:23 IST|Sakshi
సామాన్యుడికీ విమానయోగం!

కొత్త పౌర విమానయాన పాలసీకి కేబినెట్ ఆమోదం
అరగంట ప్రయాణ వ్యవధికి చార్జీ రూ.1,250 మాత్రమే...
వివాదాస్పద 5/20 నిబంధనకు చెల్లు...
ప్రాంతీయ కనెక్టివిటీ పెంపునకు పాలసీలో పెద్దపీట...
దీనికోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు... టికెట్లపై అదనపు పన్ను
ప్రయాణాల రద్దు రుసుములపైనా పరిమితి.. బ్యాగేజీ చార్జీల తగ్గింపు


న్యూఢిల్లీ: సామాన్యుడికి విమానయానాన్ని మరింత చేరువచేయడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే టికెట్ చార్జీని వసూలు చేయాల్సి ఉంటుంది. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అంతేకాకుండా దేశంలోకి మరిన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు అడుగుపెట్టేందుకు వీలుగా వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా చరమగీతం పాడింది.

ప్రయాణికులకు టికెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు. బుధవారమిక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఏవియేషన్ పాలసీకి ఆమోదముద్ర పడింది. ఇప్పటిదాకా విమానసర్వీసులు లేని రూట్లలో విమానాలను నడిపే ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్ కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలను కూడా పాలసీలో కల్పించారు. మరోపక్క, ప్రాంతీయంగా విమాన సర్వీసులను పెంచేందుకు వీలుగా రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులపై అదనంగా స్వల్ప పన్నును విధించనున్నారు.

 గేమ్ చేంజర్ పాలసీ ఇది: అశోక్ గజపతి రాజు
దేశీ విమానయాన రంగాన్ని సమూలంగా మార్చివేసే(గేమ్ చేంజర్) పాలసీగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దీన్ని అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి సమీకృత జాతీయ పౌర వియానయాన పాలసీని తీసుకొచ్చిన ఘనత తమ ఎన్‌డీఏ ప్రభుత్వానిదేనని ట్వీట్ చేశారు. ఈ కొత్త విధానం కారణంగా 2022 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించనుందని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రధానంగా విమానయాన ప్రయాణాన్ని మరింత మందికి చేరువచేసేలా టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేలా చర్యలు తీసుకోవడం, ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, మౌలిక వసతుల ను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలని అశోక్ గజపతి వివరించారు.  కాగా, 5/20 నిబంధన రద్దుపై కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. అసంబంద్ధమైన ఈ నిబంధనను చెత్తబుట్టలోకి విసిరేశామన్నారు. కొత్త పాలసీ విమానయాన పరిశ్రమకు కీలక మలుపు అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు, నిపుణులు పేర్కొన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు రావడానికి, సామాన్యునికి విమాన సేవలను చేరువ చేయడానికి దోహదం చేస్తుందన్నారు.

 ఇతర ముఖ్యాంశాలివీ...
హెలికాప్టర్ సర్వీసులకు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక నిబంధనలను రూపొందించనుంది. నిషేధిత ఎయిర్‌స్పేస్ వెలుపల 5,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో తిరిగే హెలీకాప్టర్లకు ఇప్పటిదాకా అనేక

అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇకపై ఈ అడ్డంకులు తొలగించనుండటంతో ప్రమాద, నిర్మాణ ప్రదేశాల నుంచి సులువుగా ల్యాండింగ్, టేకాఫ్‌లకు వీలు కలగనుంది.

భారత్‌ను విమాన మరమ్మతులు, మెయింటెనెన్స్ కార్యకాలాపాలకు(ఎంఆర్‌ఓ) ప్రధాన గమ్యం(హబ్)గా చేసేందుకు పాలసీలో చర్యలు చేపట్టారు. పాలసీ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఐదేళ్లపాటుఎంఆర్‌ఓ బిజినెస్ సంస్థలకు ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు అదనపు చార్జీలు, రాయల్టీలను విధించకూడదు. అదేవి దంగా తగినంత స్థలాన్ని కూడా చూపాల్సి ఉంటుంది. ఈ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను విధించకూడదు.

కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) కొనసాగించనుంది. ఇప్పటికే ఏఏఐ ఎయిర్‌పోర్టు ఉన్న 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టుకు గనుక అనుమతిస్తే.. ఏఏఐకి తగువిధంగా నష్టపరిహారాన్ని ఇవ్వనున్నారు.

ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం.

గంట ప్రయాణానికి చార్జీ రూ.2,500 మాత్రమే...!
విమానయానాన్ని చౌకగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇకపై అరగంట ప్రయాణ వ్యవధిగల టికెట్‌లపై రూ.1,250... గంట ప్రయాణ వ్యవధిగల టికెట్ చార్జీ రూ.2,500కు మాత్రమే పరిమితమయ్యేలా పాలసీలో ఫిక్స్ చేశారు. 130 కోట్ల మంది ప్రజలున్న మన దేశంలో ఏటా 80 లక్షల మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారని.. తాజా పాలసీ చర్యలతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మంత్రి అశోక్ గజపతి చెబుతున్నారు. ఈ రేట్లను కంపెనీలు భరించేందుకుగాను ప్ర భుత్వం పన్ను రాయితీలను కల్పిస్తోంది. విమాన ఇంధనం(ఏటీఎఫ్)పై అన్ని రాష్ట్రాలూ ఇక వ్యాట్‌ను 1 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను కల్పించనుంది.

5/20 రూల్ ఇక 0/20...
విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలకు అడ్డంకిగా ఉన్న వివాదాస్పద 5/20 రూల్‌ను కొత్త పాలసీలో పూర్తిగా రద్దు చేశారు. ఏదైనా దేశీ ఎయిర్‌లైన్స్ విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలంటే కార్యకలాపాలు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తవడంతోపాటు కనీసం 20 విమానాలు కంపెనీకి ఉండాలనేది 5/20 నిబంధన. కొత్తగా ప్రారంభమైన ఎయిర్‌ఏషియా, విస్తారా వంటి ఎయిర్‌లైన్స్ దీన్ని రద్దు చేయాలని వాదించగా.. పాత ఎయిర్‌లైన్స్ మాత్రం తమకు వర్తింపజేసిన ఈ రూల్‌ను అర్ధంతరంగా ఎలా రద్దు చేస్తారంటూ అభ్యంతరాలను లేవనెత్తాయి. అయితే, కేంద్రం ఈ రూల్‌ను తొలగించే విషయంలో కొంత మధ్యేమార్గాన్ని అనుసరించింది. 5/20 స్థానంలో ఇప్పుడు 0/20 నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. అంటే విదేశీ రూట్లకు విస్తరించాలంటే కనీసం 20 విమానాలు ఉంటే సరిపోతుంది. లేదంటే తమకున్న విమానాల్లో 20 శాతాన్ని దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తే చాలు అనుమతి లభిస్తుంది.

రీజినల్ కనెక్టివిటీ స్కీమ్...
దేశంలో విమాన సర్వీసులకు ప్రాంతీయ అనుసంధాన్ని పెంచేందుకు దీన్ని ప్రవేశపెడుతున్నారు. దీనిప్రకారం నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం గుర్తించింది. వీటిని డిమాండ్‌కు అనుగుణంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై అదనంగా స్వల్ప పన్ను విధింపు ద్వారా ఈ ఫండ్‌కు నిధులను సమకూర్చనున్నట్లు పాలసీలో ప్రకటించారు.

రద్దు ఫీజులు, రిఫండ్స్ ఇలా...
ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే ఇకపై ఎయిర్‌లైన్స్ చార్జీలో బేస్ ధర కంటే ఎక్కువగా ఫీజు రూపంలో కోతవేయడానికి లేకుండా పాలసీలో పరిమితి విధించారు. అదేవిధంగా ఫ్లైట్ లేదా టికెట్ రద్దయితే ప్రయాణికుడికి 15 రోజుల్లోగా రిఫండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక, రాయితీ ధరలపై విక్రయించే టికెట్లపై కూడా ఇకపై రిఫండ్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ అవకాశం లేదు. మరోపక్క, బోర్డింగ్ పాస్ ఇచ్చాక ఏ కారణంగానైనా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌ను రద్దు చేయడం, ప్రయాణానికి అనుమతించకపోతే ఇకపై భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది. కొత్త పాలసీ ప్రకారం తొలుత నిర్దేశించిన ప్రయాణ సమయానికి 24 లోపు మళ్లీ ప్రయాణానికి వీలుకల్పిస్తే... నష్టపరిహారం 200%(బేస్ ధర, ఇంధన సర్‌చార్జీలపై) ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి రూ.10,000. అదే 24 గంటల తర్వాత ప్రత్యామ్నాయ ఫ్లైట్ చూపిస్తే... నష్టపరిహారం 400%(గరిష్టంగా రూ.20,000) చెల్లించాలి. గంటలోపు మరో ఫ్లైట్‌కు గనుక పంపిస్తే ఎలాంటి నష్టపరిహారం ఉండదు.

అదనపు బ్యాగేజీపై ఫీజు తగ్గింపు..
ఇప్పటివరకూ విమానాల్లో చెక్-ఇన్ కింద ఉచితంగా 15 కేజీల వరకూ బ్యాగేజీని అనుమతిస్తున్నాయి. చార్జీ చెల్లిస్తే గరిష్టంగా 20 కేజీలకు అనుమతి ఉంది. ప్రస్తుతం అదనపు బ్యాగేజీపై ప్రతి కేజీకి ఎయిర్‌లైన్స్ రూ.250-350 వరకూ చార్జీని విధిస్తున్నాయి. పాలసీలో దీన్ని తగ్గిస్తూ కేవలం రూ.100కే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. అయితే, ఎయిరిండియా ఫ్లైట్‌లలో 25 కేజీల వరకూ ఉచిత బ్యాగేజీకి అనుమతిస్తుండటంతో ఈ రూల్ దీనికి వర్తించదు.

మరిన్ని వార్తలు