జల విద్యుత్తుకు కొత్త ‘వెలుగు’!

8 Mar, 2019 05:14 IST|Sakshi

భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా

రూ. 31,600 కోట్ల విద్యుత్‌ పెట్టుబడులకు ఆమోదం

ఎన్‌హెచ్‌పీసీ చేతికి ల్యాంకో తీస్తా ప్రాజెక్టు

ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలు  

న్యూఢిల్లీ: దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... ఈ రంగానికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.31,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో రెండు థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లు సహా జమ్మూకశ్మీర్‌లో చీనాబ్‌ నదిపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టు కూడా ఉంది.

రుణ సమస్యల్లో చిక్కుకున్న ల్యాంకో గ్రూపునకు చెందిన 500 మెగావాట్ల తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టును (సిక్కిం) ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసేందుకు కూడా కేంద్రం అనుమతించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను... సమావేశానంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాకు తెలిపారు. దేశంలో జలవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.  

రెన్యువబుల్‌ ఎనర్జీ హోదా
25 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టులకే ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు హోదా ఇస్తున్నారు. ఈ హోదా ఉంటే ఆర్థిక సహకారం, తక్కువ వడ్డీకి రుణాలు వంటి పలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు కూడా ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం రెన్యువబుల్‌ ఎనర్జీ విభాగంలో సోలార్, పవన, 25 మెగావాట్ల వరకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులు కలిపి 74 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

దీనికి అదనంగా 45 గిగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం తోడు కానుంది. 2022 నాటికి 175 గిగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీని సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే, భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులక్కూడా ఈ హోదాను కట్టబెట్టడంతో 2022 నాటికి 225 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ విభాగంలో సాధించనుంది. ప్రాజెక్టుల జీవితకాలాన్ని 40 ఏళ్లకు పెంచుకుని, టారిఫ్‌ రేట్లు తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు వీలు కల్పిస్తాయి. రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి 18 ఏళ్లకు పెరుగుతుంది.

ప్రస్తుతం జలవిద్యుత్‌ టారిఫ్‌లు ఇతర వనరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో ఇకపై ఇవి క్రమబద్ధీకరణ చెందనున్నాయి. భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులు రెన్యువబుల్‌ ఎనర్జీ సర్టిఫికెట్లను డిస్కమ్‌లకు విక్రయించగలుగుతాయి. డిస్కమ్‌లు నిర్ణీత శాతం మేర రెన్యువబుల్‌ ఎనర్జీని కొనుగోలు చేయాలి. లేదంటే రెన్యువబుల్‌ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 200 మెగావాట్ల వరకు ఒక్కో మెగావాట్‌కు రూ.1.5 కోట్లు, అంతకుమించితే ఒక్కో మెగావాట్‌కు రూ.కోటి మేర నిధుల సాయానికి కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది.

ల్యాంకో తీస్తా ప్రాజెక్టు ఎన్‌హెచ్‌పీసీకి
ల్యాంకో తీస్తా హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ను ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసేందుకు సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సిక్కింలోని తీస్తా స్టేజ్‌–6 హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుపై ఎన్‌హెచ్‌పీసీ రూ.5,748 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఇందులో ల్యాంకో తీస్తా హైడ్రో ప్రాజెక్టు కొనుగోలుకు రూ.907 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనుల పూర్తికి గాను రూ.3,863 కోట్లను ఖర్చు చేయనుంది. 125 మెగావాట్ల నాలుగు యూనిట్లతో కూడిన (500 మెగావాట్లు) ఈ ప్రాజెక్టులో ఏటా 2,400 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్‌ జిల్లాలో ఉన్న చీనాబ్‌ నదిపై చీనాబ్‌ వ్యాలీ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 624 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి  రూ.4,287 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో              ఎన్‌హెచ్‌పీసీ రూ.630 కోట్ల పెట్టుబడులతో వాటా తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పునాదిరాయి వేసిన      విషయం గమనార్హం.

థర్మల్‌ ప్రాజెక్టులు
బిహార్‌లోని బుక్సర్‌లో ఒక్కోటి 660 మెగావాట్ల రెండు యూనిట్లను రూ.10,439 కోట్లతో ప్రభుత్వరంగ ఎస్‌జేవీఎన్‌ అనుబంధ కంపెనీ ఎస్‌జేవీఎన్‌ థర్మల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమవుతుందని సీసీఈఏ పేర్కొంది. 2023–24 నుంచి ఈ ప్రాజెక్టు పనిచేయడం ఆరంభమవుతుంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 660 మెగావాట్ల రెండు సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను రూ.11,089 కోట్ల వ్యయ అంచనాలతో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  

వాటాల అమ్మకంపై అంతిమ అధికారం కమిటీకే
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంపై నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు గాను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అధికారాలను కట్టబెడుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు విక్రయించాలి, ధర, ఎంత మొత్తం షేర్లను విక్రయించాలన్న నిర్ణయాలను ఈ యంత్రాంగం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) 2017లో ఏర్పాటైంది. ఇందులో రవాణా మంత్రి, సంబంధిత కంపెనీపై అధికారాలున్న శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు.

కేవలం నియమ, నిబంధనలనే ఈ కమిటీ ఇప్పటి వరకు నిర్ణయిస్తుండేది. సీసీఈఏ తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వరంగ సంస్థను ఎంత ధరకు విక్రయించాలి, ఎన్ని వాటాలను విక్రయించాలన్న నిర్ణయాలను కూడా ఏఎం తీసుకోనుంది. దీంతో వేగంగా విక్రయం సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. పవన్‌హన్స్, ఎయిర్‌ఇండియా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్, బీఈఎంఎల్, స్కూటర్స్‌ ఇండియా, భారత్‌ పంప్స్‌ కంప్రెషర్స్, సెయిల్‌కు చెందిన పలు యూనిట్లలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.   

మరిన్ని వార్తలు