చక్కెర రంగానికి రూ.5,538 కోట్లు

27 Sep, 2018 00:43 IST|Sakshi

ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఓకే

టన్ను చెరకు క్రషింగ్‌కు  రూ.13.88 సాయం

రూ.1,000–3,000 మధ్య     రవాణా సబ్సిడీ

ఎగుమతి కోసం చేసే  రవాణాకు వర్తింపు

చెరకు మిల్లులకు కాకుండా రైతుల ఖాతాల్లో జమ

తద్వారా రూ.13,567 కోట్ల బకాయిలకు మోక్షం

న్యూఢిల్లీ: చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలియజేసింది. చెరకు పండించే వారికి ఇచ్చే ఉత్పత్తి సాయం, ఎగుమతి చేసే మిల్లులకు ఇచ్చే రవాణా సబ్సిడీ రెండు రెట్లకు పైగా పెరిగింది. మిగులు చక్కెర నిల్వల సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో చక్కెర పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన మూడో సాయం ఇది. ఇప్పటికే షుగర్‌కేన్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు అధిక ధరలు నిర్ణయించడంతోపాటు, ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యల్ని కేంద్రం గతంలో ప్రకటించింది. అతి త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

అధిక ఉత్పత్తికి పరిష్కారం 
‘‘గతేడాది, ఈ సంవత్సరం కూడా చక్కెర తయారీ అధికంగా ఉంది. వచ్చే ఏడాది కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా. దీంతో అధిక ఉత్పత్తి సమస్యను పరిష్కరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఓ సమగ్ర విధానానికి ఆమోదం తెలిపింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. చెరకు ఉత్పత్తి, ఎగుమతి వ్యయాల తగ్గింపునకు మొత్తం రూ.5,538 కోట్ల రూపాయిల సాయం అందించనున్నట్టు చెప్పారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలతో దేశీయ మార్కెట్‌ స్థిరపడడంతోపాటు చెరకు రైతులకు మిల్లులు చెల్లింపులు చేయగలవని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు.

ప్యాకేజీలోని అంశాలు...
2018–19 మార్కెటింగ్‌ సంవత్సరానికి క్వింటాల్‌ చెరకు క్రషింగ్‌కు గాను ప్రభుత్వం రూ.13.88 సాయం అందిస్తుంది. 2017–18 మార్కెటింగ్‌ సంవత్సరానికి ఈ సాయం రూ.5.50గానే ఉంది. ఈ ఒక్క సాయానికే రూ.4,163 కోట్ల మేర కేంద్రంపై భారం పడుతుంది. 2018–19 మార్కెటింగ్‌ సంవత్సరం (అక్టోబర్‌–సెప్టెంబర్‌)లో 5 మిలియన్‌ టన్నుల ఎగుమతులకు గాను అంతర్గత రవాణా, నిర్వహణ చార్జీల రూపంలో మిల్లులకు పరిహారం లభించనుంది. పోర్ట్‌లకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మిల్లులు, అవి ఎగుమతి కోసం చేసే రవాణా వ్యయాలపై ప్రతీ టన్నుకు రూ.1,000 సబ్సిడీగా అందుతుంది. 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటే టన్నుకు సబ్సిడీ రూ.2,500 లభిస్తుంది. తీర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు టన్నుపై రూ.3,000 లేదా వాస్తవంగా అయిన వ్యయం... ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంతమేర సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.1,375 కోట్ల భారం పడుతుంది. అయితే, ఈ రెండు  ప్రయోజనాలను మిల్లులకు నేరుగా ఇవ్వకుండా, అవి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు తీర్చేందుకు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. చక్కెర కర్మాగారాలు  రైతులకు రూ.13,567 కోట్ల  బకాయిలు (యూపీలోని మిల్లులకే రూ.9,817 కోట్లు) చెల్లించాల్సి ఉంది. అవి తీర్చడంతోపాటు, ఎగుమతులు పెంపునకు కేంద్రం చర్యలు వీలు కల్పించనున్నాయి.

నూతన టెలికం పాలసీకి  పచ్చజెండా
నూతన టెలికం విధానం ‘నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ (ఎన్‌డీసీపీ) 2018’కి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ విధానం లక్ష్యాలుగా ఉన్నాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అంతర్జాతీయంగా చాలా వేగంగా మారుతున్నాయని... ముఖ్యంగా 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, మెషీన్‌ టు మెషీన్‌ కమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరిస్థితి ఉందని కేంద్ర టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. జీడీపీలో టెలికం రంగం వాటా ప్రస్తుతం ఆరు శాతంగా ఉంటే, అది ఎనిమిది శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి మనోజ్‌ సిన్హా చెప్పారు. 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తరలివస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. సమాచార సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, 5జీ టెక్నాలజీ, ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా అందరికీ అధిక వేగంతో కూడిన బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అందుబాటులో ఉంచడం, 40 లక్షల ఉద్యోగాల కల్పన, ఐసీటీ సూచీలో భారత ర్యాంకును 50కు తీసుకురావడం నూతన విధానం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.  

జీఎస్‌టీఎన్‌ ఇక పూర్తిగా ప్రభుత్వ సంస్థ
జీఎస్‌టీకి ఐటీ వ్యవస్థను అందించే జీఎస్‌టీ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌)ను నూరు శాతం ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం అనుమతి తెలిపినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. జీఎస్‌టీఎన్‌ను పునర్‌వ్యవస్థీకరించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యాజమాన్యాన్ని సమంగా వేరు విభజించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జీఎస్‌టీఎన్‌లో కేంద్రం, రాష్ట్రాలకు కలిపి 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌ఎస్‌ఈ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఉంది. 

ఐటీడీసీ హోటళ్ల విక్రయాలు
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా జమ్మూ కశ్మీర్, బిహార్‌ రాష్ట్రాల్లో ఐటీడీసీకి ఉన్న రెండు హోటళ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది.   

మరిన్ని వార్తలు