ఎఫ్‌ఐపీబీ రద్దుకు క్యాబినెట్‌ ఆమోదం

25 May, 2017 08:19 IST|Sakshi
ఎఫ్‌ఐపీబీ రద్దుకు క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ)ను రద్దు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీని స్థానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత శాఖలే నిర్ణయం తీసుకునే విధంగా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. కీలకమైన రంగాల్లో ప్రతిపాదనలకు మాత్రం హోంశాఖ అనుమతులు తప్పనిసరని వివరించారు. ప్రస్తుతం ఎఫ్‌ఐపీబీ దగ్గర పెండింగ్‌లోని ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపనున్నట్లు జైట్లీ చెప్పారు. రూ. 5,000 కోట్ల పైబడిన ప్రతిపాదనలకు ఎప్పట్లాగే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఓకే చెప్పా ల్సిందే. 1990లలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రధాని కార్యాలయం పరిధిలో ఎఫ్‌ఐపీబీ ఏర్పాటైంది.

స్థానిక ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఓకే..
ప్రభుత్వ విభాగాల్లో ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోలుకు సంబంధించి స్థానిక సరఫరాదారులకు ప్రాధాన్యమిచ్చేలా కొత్త విధానానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఉపాధికల్పనతో పాటు మేకిన్‌ ఇండియా కార్యక్రమానికీ ఊతం లభించనుంది. స్థానిక కంటెంట్‌ కనీసం 50% ఉన్న ఉత్పత్తులు, సర్వీసులందించే సంస్థలకు ప్రాధాన్యం దక్కుతుంది.

>
మరిన్ని వార్తలు