క్యాడిలా లాభం మూడు రెట్లు

14 Aug, 2018 01:58 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.461 కోట్లకు పెరిగిందని క్యాడిలా హెల్త్‌కేర్‌ తెలియజేసింది. అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,235 కోట్ల నుంచి రూ.2,894 కోట్లకు పెరిగింది. ఎబిటా 133 శాతం పెరిగి రూ.645 కోట్లకు చేరిందని, రూ.101 కోట్ల ఇతర ఆదాయం సాధించామని క్యాడిలా తెలియజేసింది.

అమెరికా వ్యాపారం 27 శాతం వృద్ధితో రూ.1,230 కోట్లకు, భారత ఫార్ములేషన్స్‌ వ్యాపారం 40 శాతం వృద్ధితో రూ.893 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో కొత్తగా మూడు ఉత్పత్తులను అమెరికా మార్కెట్లోకి విడుదల చేశామని, మూడు కొత్త ఔషధాల కోసం దరఖాస్తు చేశామని, 13 కొత్త ఔషధాలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదాలు పొందామని వివరించింది.

విండ్‌లాస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీలో 51 శాతం వాటాను  రూ.156 కోట్లకు కొనుగోలు చేశామని క్యాడిలా హెల్త్‌కేర్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఫార్మా తయారీ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునే చర్యలో భాగంగా ఈ వాటాను కొనుగోలు చేశామని వివరించింది. వచ్చే నెల చివరికల్లా ఈ డీల్‌ పూర్తవ్వగలదని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో క్యాడిలా హెల్త్‌కేర్‌ షేర్‌ ధర 6 శాతం పతనమై రూ.355 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు