‘కేఫ్‌ కాఫీ డే’లో మరో కొత్త కోణం

2 Aug, 2019 19:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కాఫీ సంస్కృతిలో కొత్త విప్లవానికి వాకిటి తెరచిన ‘కేఫ్‌ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన కాఫీ డేలకు సంబంధించి రోజుకొక సామాజిక కోణం వెలుగులోకి వస్తోంది. కాఫీ డే ప్రతి స్టోర్‌లో రకరకాల కాఫీలు కలిపే నిపుణుల్లో ఎక్కువ మంది మూగ, చెవుడు వాళ్లేనట. వాళ్లకే రకరకాల కాఫీల సువాసనలు సులభంగా పసిగట్టే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా వారు రుచులను కూడా సరిగ్గా గుర్తించగలరట. ఇలాంటి వాళ్లను కార్పొరేట్‌ రంగం సాధారంగా పనిలోకి తీసుకోదు. ఒక్క కాఫీ కేఫ్‌ల రంగంలోనే అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సమాజంలో అంతగా ఆదరణలేని మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ద్వారా కొంత సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు ఉండడమే కాకుండా సువాసనలను సులభంగా పసిగట్టే వారి నైపుణ్యం కేఫ్‌లకు ఉపయోగపడుతుందని, ఆ ఉద్దేశంతోనే అలా ఎక్కువ మందిని తీసుకున్నట్లు మార్కెటింగ్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణన్‌ తెలిపారు.

ఇలా మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ఒక్క ‘కేఫ్‌ కాఫీ డే’లకే పరిమితం కాలేదు. కేఎఫ్‌సీలోని ‘కాఫీ కోస్టా’ అవుట్‌లెట్లకు కూడా విస్తరించింది. వాటిల్లో ఒక్క కాఫీలను తయారు చేసే నిపుణులే కాకుండా కాఫీలను, స్నాక్స్‌ను సరఫరా చేసే వాళ్లలో కూడా ఎక్కువ మంది మూగ, చెవిటి వాళ్లేనట. వాళ్లంతా సైగలతోనే మాట్లాడుకుంటారట. వారు పరస్పరం నోరు విప్పు మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కాఫీ హౌజ్‌లు నిశ్శబ్దంగా ఉంటాయట, అలాంటి నిశ్శబ్ద ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారని, ఒక్క బెంగళూరులోని తమ ‘కాఫీ కోస్టా’ అవుట్‌ లెట్లలో దాదాపు 200 మంది మూగ, చెవిటి వాళ్లు పనిచేస్తున్నారని ఓ అవుట్‌లెట్‌ మేనేజర్‌ వివరించారు. చెవిటి సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు కాగితంపై రాయించి తీసుకుంటారని ఆయన తెలిపారు. అయితే మేనేజర్‌ మాత్రం మూగ, చెవుడు కాకపోవడమే కాకుండా మూగ భాష కూడా రావాలని ఆయన చెప్పారు.

స్టార్‌బక్‌ కాఫీ హౌజుల్లో కూడా ఎక్కువ మంది చెవిటి వాళ్లే పనిచేస్తున్నారని తెల్సింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు డీసీ స్టార్‌బక్స్‌ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు కూడా చెవిటి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారట. మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడానికి ఈ కార్పొరెట్‌ కాఫీ సంస్థలు రెండు కారణాలే చెబుతున్నాయిగానీ మూడో కారణం కూడా ఉందని మనం ఊహించవచ్చు. చెవిటి వాళ్లు కాస్త తక్కువ వేతనాలకు దొరకుతారన్న విషయం తెల్సిందే.

>
మరిన్ని వార్తలు