శాంతించిన టోకు ద్రవ్యోల్బణం!

17 Oct, 2017 10:42 IST|Sakshi

సెప్టెంబర్‌లో స్పీడ్‌ 2.6 శాతం

ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదల కారణం

ఆగస్టులో పెరుగుదల 3.24 శాతం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో శాంతించింది. సెప్టెంబర్‌లో 2.60 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 సెప్టెంబర్‌తో పోల్చితే 2017 సెప్టెంబర్‌లో టోకు ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 2.60 శాతమే పెరిగిందన్నమాట.

ఆగస్టులో ఈ రేటు 3.24 శాతం ఉండగా,  2016 సెప్టెంబర్‌లో 1.36 శాతం. టోకు ధరలు శాంతించడానికి ఆహార ఉత్పత్తులు, కూరగాయల ధరలు కొంత తగ్గుదల ప్రధాన కారణం. ప్రభుత్వం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సూచీలో మూడు ప్రధాన భాగాలనూ వార్షిక ప్రాతిపదికన ఒకసారి పరిశీలిస్తే...

ప్రాథమిక వస్తువులు: ఫుడ్, నాన్‌ఫుడ్‌ ఆర్టికల్స్‌ తదితర వస్తువులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.68 శాతం నుంచి – 3.86 శాతం క్షీణతకు పడింది. ఇందులో ఫుడ్‌ ఆర్టికల్స్‌ రేటు 7.78 శాతం నుంచి భారీగా క్షీణత (మైనస్‌) 3.47 శాతానికి క్షీణించింది. ఆగస్టులో ఈ రేటు 5.75 శాతం.  నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌ రేటు కూడా ఇదే రీతిన 6.15 శాతం నుంచి – 5.15 శాతానికి క్షీణించింది.

ఇంధనం విద్యుత్‌:  ఈ రేటు  స్వల్పంగా 9.99 శాతం నుంచి 9.01 శాతానికి తగ్గింది. రెండు నెలల నుంచీ ఈ రేటు పెరుగుతోంది.  

తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో రేటు –0.27 శాతం నుంచి 2.27 శాతానికి ఎగసింది.  ఆగస్టులో ఈ రేటు 2.45 శాతం.


నిత్యావసరాల ధరలు చూస్తే...
కూరగాయల ధరలు ఆగస్టులో ఏకంగా 44.91 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల 15.48 శాతం. అయితే సెప్టెం బర్‌లో ఉల్లిపాయల ధరలు మాత్రం 79.78 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 5.47 శాతం ఎగశాయి. పప్పు ధరలు 24.26 శాతం, ఆలూ ధరలు 46.52 శాతం, గోధుమల ధరలు 1.71 శాతం తగ్గాయి.

మరిన్ని వార్తలు