కాల్ డ్రాప్స్ కు పరిహారం కుదరదు..

12 May, 2016 00:42 IST|Sakshi
కాల్ డ్రాప్స్ కు పరిహారం కుదరదు..

టెల్కోలపై ట్రాయ్ ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
చట్ట విరుద్ధ ఏకపక్ష చర్యని స్పష్టీకరణ

 న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్‌కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని,  తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని కూడా న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాల్‌డ్రాప్స్ ఒక్కింటికీ రూ.1 చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలను భారత్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ల అత్యున్నత సంస్థ- సీఓఏఐ  (సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ హైకోర్టులోనూ తీర్పు ప్రతికూలంగా వచ్చింది. దీనితో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు రూలింగ్‌తో కాల్ డ్రాప్స్ విషయంలో టెలికం సంస్థలకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. సీఓఏఐలో వొడాఫోన్, భారతీ, రియలన్స్ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.

ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం: టెలికం కంపెనీలు
ఈ కేసులో టెలికం కంపెనీలు తమ వాదనలు వినిపిస్తూ... ఈ రంగం ఇప్పటికే తీవ్ర రుణ సంక్షోభంలో ఉన్నట్లు తెలిపాయి. స్పెక్ట్రమ్‌కు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తున్నట్లు వివరించాయి. ఈ రంగంలో భారీ లాభాలను పొందుతున్నట్లు ట్రాయ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ... మౌలిక రంగంపైనే భారీ ఖర్చులు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదీ కాకుండా కాల్ డ్రాప్స్ దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నట్లు టెలికం కంపెనీల తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. తాజా తీర్పు పట్ల సీఓఏఐ, అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఒక సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. వినియోగదారులకు పటిష్ట, నాణ్యమైన సేవలు అందాలన్న ట్రాయ్ ఆలోచనలను అర్థం చేసుకున్నామని,  ఈ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి.

 సేవలు మెరుగుపడాలి: కేంద్రం
సుప్రీం తీర్పుపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆచితూచి స్పందించారు. కోర్టు ఉత్తర్వుల తదనంతర పరిణామాలను, సేవల పెంపును మెరుగుపరిచే మార్గాలను ట్రాయ్ పరిశీలిస్తుందని అన్నారు. టెలికం కంపెనీలు సేవల మెరుగుదలపై మరింత దృష్టి సారిస్తాయని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా టెలికం సేవలు బలహీనంగా ఉన్న విషయం సుస్పష్టమన్నారు. కాగా సుప్రీం ఉత్తర్వుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు