2030 నాటికి 300 మిలియన్‌ టన్నులు

22 Jul, 2017 03:02 IST|Sakshi
2030 నాటికి 300 మిలియన్‌ టన్నులు

ఉక్కు ఉత్పత్తిపై ఎన్‌ఎండీసీ టెక్నికల్‌ డైరెక్టర్‌ నందా వ్యాఖ్య  

విశాఖ సిటీ: దేశంలోని అన్ని స్టీల్‌ ప్లాంట్ల నుంచి 2030 నాటికి ఏడాదికి 300 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఎన్‌ఎండీసీ టెక్నికల్‌ డైరెక్టర్‌ ఎన్‌కె నందా చెప్పారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన నేషనల్‌ స్టీల్‌ పాలసీ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్లాంట్‌ కృషి చెయ్యాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం, కోల్‌కతాకు చెందిన స్టీల్‌ మెటలర్జీ సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో మేకిన్‌ ఇండియా– మేకిన్‌ స్టీల్‌ సదస్సు జరిగింది. దీన్లో సెయిల్, ఎన్‌ఎండీసీ సహా.. పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ ప్రస్తుతం ఏడాదికి 90 మిలియన్‌ టన్నలు స్టీల్‌ ఉత్పత్తి అవుతోందని.. దీన్ని 2030 నాటికి 3 రెట్లు పెంచడమే లక్ష్యమని చెప్పారు.

ఉత్పత్తిలో నాణ్యతతో పాటు ఎలక్ట్రో స్టీల్‌ వంటి వాటిని దేశంలో ఉత్పత్తి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు స్టీల్‌ ప్లాంట్లను కొత్తగా ప్రారంభించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. ఒడిషా, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 5 నుంచి 6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్లు రానున్నట్లు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ డైరెక్టరు డీఎన్‌రావు, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఈడీ డా.ఎస్‌ఎన్‌రావు, ఐఎన్‌ఎస్‌ డీఎజీ డైరెక్టర్‌ జనరల్‌ సుషిమ్‌ బెనర్జీ, సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ మురళీధరన్, స్టీల్‌ అండ్‌ మెటలర్జీ ఎడిటర్‌ నిర్మల్య ముఖర్జీ, విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్‌ పీఎల్‌ హరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు