క్యామ్లిన్‌ ఫైన్‌సైన్స్‌ -బంధన్‌ బ్యాంక్‌.. భళా

7 Jul, 2020 11:15 IST|Sakshi

ఇన్ఫినిటీ హోల్డింగ్స్‌ వాటా కొనుగోలు

6.5 శాతం జంప్‌చేసిన క్లామ్లిన్‌ ఫైన్‌

ఈ ఏడాది క్యూ1లో పనితీరు భేష్‌

5 శాతం ఎగసిన బంధన్‌ బ్యాంక్‌ షేరు

ప్రపంచ మార్కెట్ల బాటలో వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతోనూ, నిఫ్టీ నామమాత్ర నష్టంతోనూ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు క్యామ్లిన్‌ ఫైన్‌సైన్స్‌, మరోపక్క బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం..

క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్స్‌
షేరుకి రూ. 56 ధరలో క్యామ్లిన్‌ ఫైన్‌సైన్స్‌కు చెందిన 6.63 లక్షలకుపైగా షేర్లను ఇన్‌ఫినిటీ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ బల్క్‌ డీల్స్‌ డేటా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 0.5 శాతం వాటాకు సమానంకాగా.. గత నెల 25న ఇన్‌ఫినిటీ హోల్డింగ్స్‌ తదితర సంస్థల నుంచి రూ. 180 కోట్లను సమీకరించేందుకు క్యామ్లిన్‌ ఫైన్‌సైన్స్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 60 వద్ద ట్రేడవుతోంది.


బంధన్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అడ్వాన్సులు, డిపాజిట్లలో వృద్ధి సాధించినట్లు పేర్కొనడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 374 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 377 వరకూ ఎగసింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రుణాలు, అడ్వాన్సులు 18 శాతం పెరిగి రూ. 74,325 కోట్లను తాకినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. మరోవైపు డిపాజిట్లు 35 శాతం పుంజుకుని రూ. 60,602 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు