కీలక పరిశ్రమల మందగమనం

1 Nov, 2014 00:49 IST|Sakshi
కీలక పరిశ్రమల మందగమనం

న్యూఢిల్లీ: కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ సెప్టెంబర్‌లో నిరాశను మిగిల్చింది. కేవలం 1.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. గత యేడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9శాతం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదు కావడం సెప్టెంబర్‌లో మొత్తం గ్రూప్ పనితీరును దెబ్బతీసింది. ఇక బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు కూడా వృద్ధి రేటు తగ్గింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు రంగాల వారీగా చూస్తే...

* క్రూడ్ ఆయిల్: 2013 సెప్టెంబర్‌లో 0.5 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2014 సెప్టెంబర్‌లో అసలు వృద్ధి లేకపోగా -1.1 శాతానికి (క్షీణతకు) జారింది.
* సహజవాయువు: క్షీణతలోనే కొనసాగినా ఈ రేటు -13.9 శాతం నుంచి -6.2 శాతానికి తగ్గింది.
* రిఫైనరీ ప్రొడక్టులు: 7.7 శాతం వృద్ధి రేటు -2.5 శాతానికి క్షీణించింది.
* ఎరువులు: ఈ రంగంలో కూడా వృద్ధి 5.3 శాతం నుంచి -11.6 శాతానికి పడింది.
* బొగ్గు: వృద్ధి రేటు 13.6% నుంచి 7.2%కి తగ్గింది.
* స్టీల్: వృద్ధి 10.7% నుంచి 4.0 శాతానికి జారింది.
*  సిమెంట్: ఈ రంగం వృద్ధి రేటు 12.1 శాతం 3.2 శాతానికి పడిపోయింది.
* విద్యుత్: ఈ రంగంలో వృద్ధి 12.9 శాతం నుంచి 3.8 శాతానికి జారింది.
 
ఆరు నెలల్లో చూసినా డౌన్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో (2013-14, ఏప్రిల్-సెప్టెంబర్) చూసినా ఈ కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు దిగజారింది. 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ కోర్ గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. సెప్టెంబర్ ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో రానున్నాయి. తాజా ఫలితాలు మొత్తంపై ఐఐపీ సెప్టెంబర్ గణాంకాలపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు