కెనరా బ్యాంక్‌ లాభం రూ. 214 కోట్లు

9 May, 2017 00:48 IST|Sakshi
కెనరా బ్యాంక్‌ లాభం రూ. 214 కోట్లు

► 57% తగ్గిన ఎన్‌పీఏ కేటాయింపులు
► ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌

బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.214 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.3,905 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాకేశ్‌ శర్మ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ.2,708 కోట్లకు తగ్గాయని వివరించారు.  మొత్తం ఆదాయం రూ.12,116 కోట్ల నుంచి రూ.12,889 కోట్లకు పెరగిందని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.

నికర వడ్డీ ఆదాయం రూ.2,708 కోట్లు
నికర వడ్డీ ఆదాయం14 శాతం వృద్ధితో రూ.2,708 కోట్లకు పెరిగిందని రాకేశ్‌ శర్మ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.1,981 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో రూ.2,937 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏ క్వార్టర్‌లోనూ ఈ స్థాయి నిర్వహణ లాభం రాలేదని పేర్కొన్నారు.

నికర వడ్డీ మార్జిన్‌ కూడా 2.19 శాతం నుంచి 2.24 శాతానికి పెరిగిందని వివరించారు. 2015–16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 9.4 శాతంగా ఉన్న  స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 9.63 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 6.42 శాతం నుంచి 6.33 శాతానికి తగ్గాయని వివరించారు. ఇక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.2,813 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,122 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు.

మరిన్ని వార్తలు