ఓబీసీ నికర లాభం రూ. 22 కోట్లు

12 May, 2016 01:01 IST|Sakshi
ఓబీసీ నికర లాభం రూ. 22 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.22 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2014-15) ఇదే  కాలంలో రూ.178 కోట్ల నికర నష్టం వచ్చిందని ఓబీసీ ఎండీ, సీఈఓ అనిమేశ్ చౌహాన్ పేర్కొన్నారు.  మొత్తం ఆదాయం రూ.5,719 కోట్ల నుంచి రూ.5,452 కోట్లకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. వడ్దీ ఆదాయం రూ.5,091 కోట్ల నుంచి రూ.4,958 కోట్లకు పడిపోయిందని తెలిపారు.

స్థూల మొండి బకాయిలు 5.18 శాతం నుంచి 9.57 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 3.34 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,107 కోట్ల నుంచి 1,026 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 70 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.

 ఇక 2015-16 పూర్తి ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే... బ్యాంక్ నికర లాభం 69 శాతం క్షీణించి రూ.497 కోట్ల నుంచి రూ.156 కోట్లకు పడిపోయింది. మొత్తం ఆదాయం రూ.22,083 కోట్ల నుంచి రూ.21,825 కోట్లకు పడిపోయినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు