కొంత రిస్క్‌ తీసుకునే వారికి.. 

13 Jan, 2020 04:49 IST|Sakshi

కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌

గతేడాది లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేస్తే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో వారికి నష్టాలు మిగిలాయి. కానీ, ఇదే పనితీరు ఎల్లప్పుడూ కొనసాగదు. ఒక్కోసారి ఒక్కో విభాగం ర్యాలీ చేస్తే, మరో విభాగం నష్టపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అన్ని రకాల స్టాక్స్‌తో కూడిన విస్తృత ర్యాలీ కూడా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు ఈ తరహా ఒక్కో విభాగం ర్యాలీ చేసిన సమయాల్లోనూ ప్రయోజనం పొందేందుకు లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. అలాగే, రెండు విభాగాలు ర్యాలీ చేసిన సందర్భాల్లో మరింత లాభపడొచ్చు. లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ పథకాన్ని పరిశీలించొచ్చు.

పథకం రూపం... 
సెబీ నిబంధనల ప్రకారం లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఒక్కో విభాగంలో కనీసం 35 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ అన్నది గతంలో మిడ్‌క్యాప్‌ ఫండ్‌. 2018లో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల వర్గీకరణల్లో మార్పుల తర్వాత లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌గా రూపం మార్చుకుంది. అంటే గతంలో మిడ్‌క్యాప్‌ పథకంగా 65 శాతం వరకు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ కలిగి ఉండేది. దాంతో రిస్క్‌ అధికం. ఇప్పుడు లార్జ్‌క్యాప్‌ పెట్టుబడులతోనూ ఉండడం కొంత రిస్క్‌ను తగ్గించేదే. అయితే, అదే సమయంలో ఈ పథకంలోని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులపై రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక మోస్తరు రిస్క్‌ తీసుకునే వారు దీర్ఘకాలం కోసం సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిశీలించొచ్చు.

పనితీరు 
కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌లో ఏడాది రాబడులు 10.20 శాతంగా ఉన్నాయి. అదే మూడేళ్ల కాలంలో వార్షికంగా 14.3 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 11.5 శాతంగా ఉన్నాయి. గతంలో కేవలం మిడ్‌క్యాప్‌ ఫండ్‌గానే ఉండడం, ప్రస్తుతం లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌గా మారినందున భవిష్యత్తు రాబడులు భిన్నంగా ఉండొచ్చు. అంటే దీర్ఘకాలానికి (5–10 ఏళ్ల కాలంలో) ఇంకాస్త మెరుగైన రాబడులను ఆశించొచ్చు. ఏడేళ్ల కాలంలో ఈ పథకం వార్షికంగా 19.65 శాతం, పదేళ్ల కాలంలో వార్షికంగా 17.77 శాతం చొప్పున రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పోర్ట్‌ఫోలియో 
మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రంగాలు, స్టాక్స్‌ ఎంపికను ఈ ఫండ్‌ మేనేజర్‌ చేస్తుంటారు. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోను ఇందులో చూడొచ్చు. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి పెద్ద పీట వేస్తూ 33.5 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడాన్ని గమనించొచ్చు. ఆ తర్వాత సేవల రంగానికి చెందిన స్టాక్స్‌లో 10 శాతం, హెల్త్‌ కేర్‌ స్టాక్స్‌లో 8 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. టాప్‌ 10 స్టాక్స్‌లో ఈ ఫండ్‌ మొత్తం పెట్టుబడులు 37 శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ పథకంలో 48.5 శాతం పెట్టుబడులు మెగా, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో, 47 శాతం మిడ్‌క్యాప్‌లో, 4 శాతం స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు