రద్దు చేసిన  రుణాలు 13 శాతం!

5 Apr, 2018 00:48 IST|Sakshi

క్రమంగా తగ్గుతున్న పరిమాణం

2011లో ఇది ఏకంగా 25 శాతం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాల రైటాఫ్‌ క్రమంగా తగ్గుతోంది. గతేడాది మార్చి ఆఖరుకి స్థూల మొండిబాకీల్లో.. రద్దు చేసిన రుణాల పరిమాణం 13%కి తగ్గింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం 2011 మార్చిలో ఇది గరిష్టంగా 25% స్థాయిలో నమోదైంది. 2006లో స్థూల ఎన్‌పీఏల్లో రైటాఫ్‌ చేసిన రుణాల పరిమాణం 21% ఉండగా, 2011 మార్చి నాటికి ఇది 25%కి ఎగిసింది. రైటాఫ్‌లు ఆ తర్వాత 2015 మార్చికి 18%, గతేడాది మార్చి నాటికి 13%కి తగ్గాయి.

సాధారణంగా పన్ను ప్రయోజనాలకు, మూలధనాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడం తదితర అవసరాల కోసం మొండిబాకీలను రద్దు చేయడం ద్వారా బ్యాంకులు తమ బ్యాలెన్స్‌ షీట్స్‌ను ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాయి. అయితే, ఖాతాల్లో రైటాఫ్‌ చేసినప్పటికీ.. రుణగ్రహీత సదరు రుణాలను తిరిగి చెల్లించాల్సిందే. దివాలా చట్టం, డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ తదితర మార్గాల్లో బాకీలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 సెప్టెంబర్‌ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,41,911 కోట్లు రైటాఫ్‌ చేశాయి.  

మరిన్ని వార్తలు