త్వరలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ విధివిధానాలు

11 Feb, 2016 01:03 IST|Sakshi
త్వరలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ విధివిధానాలు

బ్రోకింగ్ కమీషన్లపై నియంత్రణ తీసేయలేం
2025కి 4 లక్షల కోట్లకు సాధారణ బీమా
ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా బ్రోకింగ్ కంపెనీలకు ఇచ్చే కమీషన్లపై నియంత్రణలను తొలిగించే ఆలోచన లేదని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం ఇస్తున్న కమీషన్లపై వున్న పరిమితిని పెంచే యోచనలో ఉన్నామని, దీనికి సంబంధించి బ్రోకర్లతో కలసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 12వ ఇన్సూరెన్స్ బ్రోకర్ల సమావేశానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంరక్షణను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కమీషన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించలేమన్నారు. కమీషన్లు అధికంగా పెంచడంవల్ల మొత్తం వ్యాపారమే దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. కానీ ఇక నుంచి ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కో కమీషన్ రేటును నిర్ణయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నాయని, మార్చిలోగా తుది బ్రోకరేజ్ నిబంధనలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. గరిష్టంగా 15 శాతం వరకు కమీషన్ తీసుకోవడానికి అనుమతిస్తూ నిబంధనలు ఉండే అవకాశం ఉందని సూత్రప్రాయంగా వెల్లడించారు. అంతకుముందు విజయన్ ఎర్నెస్ట్ యంగ్ విడుదల చేసిన విజన్ 2025 నివేదికను విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐబీఏఐ ప్రెసిడెంట్ సంజయ్ కేడియా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కమీషన్ల రేట్లపై పరిమితులు ఉండకూడదని, వీటిని మార్కెట్ రేట్లకే వదిలిపెట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఐఆర్‌డీఏని కోరారు. ప్రస్తుతం సాధారణ బీమా వ్యాపారంలో 27% బ్రోకింగ్ సంస్థల నుంచే వస్తోం దని, ఇది వచ్చే పదేళ్లలో 40 శాతం చేరుతుందన్నారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో దేశీయ సాధారణ బీమా వ్యాపారం రూ. 83,048 కోట్ల నుంచి రూ. 4,00,000 కోట్లకు చేరుతుందని, ఈ విధంగా చూస్తే బ్రోకింగ్ వ్యాపారం రూ. 20,000 కోట్ల నుంచి రూ. 1.60 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ఐఆర్‌డీఏని కోరినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు